
నెట్‌వర్క్ ఆస్పత్రుల పోరాటం షురూ!
● పెండింగ్ బిల్లుల కోసం నేడు మహాధర్నా ● ఇప్పటికే 15 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ● జిల్లాలో 13 ఆస్పత్రులకు రూ.147 కోట్ల బకాయిలు
అరసవల్లి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై 17 నెలల్లోనే ఓ స్పష్టత వచ్చేసింది.. ఏ వర్గాన్ని చూసినా నిరసనలు, ధర్నాల్లోనే కనిపిస్తున్నారు. పలు శాఖలకు చెందిన ప్రభుత్వ శాఖ ఉద్యోగులు, పీహెచ్‌సీ వైద్యులంతా కొద్ది రోజులుగా నిరసనలను చేపడుతుండగా.. తాజాగా ఆరోగ్యశ్రీ పథకం పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఏకంగా ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రుల యజమానులు ధర్నాలకు సమాయత్తమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కీలకమైన వైద్యారోగ్యంపై వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందునా ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం చేయడం, ఎన్టీఆర్ వైద్యసేవల పేరిట పేరు మార్చడంతో పాటు పథకాన్ని బీమా కంపెనీలకు అప్పగిస్తారన్న ప్రచారం నేపథ్యంలో పెద్ద దుమారమే నడుస్తోంది. తాజాగా రాష్ట్రంలో నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ. 2700 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 13 నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.147 కోట్ల వరకు పెండింగ్ బిల్లులున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోషియేషన్ (ఆశ) ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో మహాధర్నా చేపట్టనున్నారు. పెండింగ్ బిల్లుల కోసం ప్రైవేటు డాక్టర్లు, ఆసుపత్రుల యాజమాన్యాలు వీధి పోరాటానికి దిగుతుండడం రాష్ట్రంలో 2007 నుంచి (ఆరోగ్యశ్రీ ప్రారంభం) నేటి వరకు ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అటకెక్కిన సేవలు
ఆశ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలో 15 రోజుల నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవలు) పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దశలవారీగా నిరసనలకు దిగిన నెట్‌వర్క్ యాజమాన్యాలు సర్కార్‌కు ఇచ్చిన గడువు ముగియడంతో ఉద్యోగుల ఈహెచ్‌ఎస్ సర్వీసులతో పాటు సాధారణ ప్రోసీసర్లు, సర్జరీలతో పాటు అత్యవసర సర్వీసులను కూడా నిలిపివేశాయి. దీంతో వేలాది మంది రోగులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రులకు రాగానే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లుగా ఫ్లెక్సీలను పెట్టడంతో రోగులు తీవ్ర ఆవేదనతో భయాందోళనతో వ్యయప్రయాసలకు గురికావాల్సి వచ్చింది. అత్యవసర కేసుల విషయంలో చాలా వరకు డబ్బులిచ్చి సర్జరీలు చేయించుకున్నారు.
నేటి ధర్నాకు సమాయత్తం
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో 13 నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సేవల బంద్ పాటిస్తున్న ప్రతినిధులంతా గురువారం విజయవాడలో మహాధర్నా చేసేందుకు సమాయత్తమవుతున్నారు. వాస్తవానికి పెండింగ్ బకాయిల్లో ప్రస్తుతానికి రూ.670 కోట్లు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించితే.. ధర్నా నిరసనలను ఆపేసి ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరిస్తామని ఆశ ప్రతినిధులు ప్రకటిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం ‘బీమా పథకం’ ఎలాగైనా అమలు చేసే క్రమంలో ధీమాగా ఉన్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే ఆరోగ్యశ్రీని అంపశయ్యపై చేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.