
కొనుగోలు కేంద్రమెక్కడ..?
హామీని మరిచిన కూటమి నేతలు
ఎడాదిన్నర గడిచినా ఏర్పాటు ఊసెత్తని వైనం
ఆందోళన చెందుతున్న రైతులు
ఆదుకోవాలి
కొత్తూరు: అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తూరు ప్రాంతంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, పత్తి రైతులకు మద్దతు ధర కల్పిస్తామని 2024 ఎన్నికల సమయంలో కూటమి నేతలు రైతులకు హామీ ఇస్తూ ఊదరగొట్టారు. అయితే ఏడాదిన్నర గడుస్తున్నా ఇంతవరకు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు ఊసెత్తకపోవడంతో కూటమి నేతల తీరుపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి పంట ఒకటి. సుమారు 25 వేల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేస్తున్నారు.
దోచుకుంటున్న దళారులు
జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు. దీంతో గుంటూరు, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పత్తి మిల్లు యజమానులు జిల్లాలో పత్తిని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దళారులు అడిగిన ధరలకు రైతులు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు గతేడాది దళారీలు కొనుగోలు చేయడం జరిగింది. దీంతో రైతులకు గిట్టబాటు ధర రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయారు. కాగా మరలా ఈ ఏడాది పత్తి సీజన్ మొదలైనప్పటికీ ఇంతవరకు కొనుగోలు కేంద్రం మంజూరు చేయలేదు. ఈ ఏడాది పత్తి సాగుకు పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోయాయి. యూరియా వంటి ఎరువులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే అధికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పత్తి కొనుగోలు కేంద్రాన్ని కొత్తూరులో ఏర్పాటు చేసి పత్తి రైతులను ఆదుకోవాలి. కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దళారీలు నిర్ణయించిన ధరకు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– పెద్దకోట జగన్నాథం, పత్తి రైతు, కొత్తూరు

కొనుగోలు కేంద్రమెక్కడ..?

కొనుగోలు కేంద్రమెక్కడ..?