
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్యాణి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో గత రెండు సంవత్సరాలుగా చనిపోయిన, రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉపాధి కల్పించాలన్నారు. 12వ (పీఆర్సీ)ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి మధ్యంతర భృతి 30 శాతం ఇవ్వాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల్లో పెరిగిన జనాభాకనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని విన్నవించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఉన్న బ్యాంక్ ఖాతాలను బలవంతంగా యాక్సిస్ బ్యాంకులోకి మార్చవద్దని, అలాగే కార్మికులపై ఒత్తిడి తెస్తున్న మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. లేనిపక్షంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, నవంబర్ 3వ తేదీన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు అర్జీ మణి, ఆర్.గణేష్, గురుస్వామి, చంద్రారావు, పొట్నూరు గణేష్, కిరణ్, రామచంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు.