
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
● ప్రభుత్వ విద్యా సంస్థల ప్రైవేటీకరణ సరికాదు ● ఏఐఎస్‌ఫ్ అధ్వర్యంలో బస్సుజాత
ఇచ్ఛాపురం: ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేస్తోందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) జాతీయ, రాష్ట్ర విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బుధవారం నుంచి బస్సుజాత కార్యక్రమం ఇచ్ఛాపురం నుంచి చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు విరాజ్‌దేవాంగ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఈనెల 22వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించామన్నారు. కానీ పోలీసులు అనుమతులివ్వలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ షెడ్యూల్ ప్రకారం హిందూపురం వరకు యాత్రను కొనసాగించి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు కావస్తున్నా విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలు, అవకాశాలను కల్పించలేక విఫలమైందని ధ్వజమెత్తారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వలరాజు మాట్లాడుతూ.. ఇటీవల మన్యం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఒక హాస్టల్‌లో 116 మంది విద్యార్థులు పచ్చ కామెర్లకు గురయ్యారంటే విద్యా సంస్థలపై ప్రభుత్వం ఎటువంటి పర్యవేక్షణ చేస్తుందో సంబంధిత మంత్రి, విద్యాశాఖామంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని విరమించుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.స్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.