
అచ్చెన్నా.. నీవు చేసిన అభివృద్ధి ఎక్కడా..?
● ధ్వజమెత్తిన పేరాడ తిలక్
నందిగాం: టెక్కలి నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు టెక్కలి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా అని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ధ్వజమెత్తారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఒక్కటైనా శాశ్వతమైన పని చేశారా అని నిలదీశారు. మూలపేట పోర్టు పనులు వైఎస్సార్‌సీపీ హయాంలో 70 శాతం పూర్తయితే, అధికారంలోకి వచ్చాక ఆ పనులను నిలుపుదల చేసింది అచ్చెన్నాయుడు కాదా అని నిలదీశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ సొంత నియోజకవర్గంలోనే రైతులకు యూరియా ఇచ్చుకోలేని అసమర్థ మంత్రిగా మిగిలారని ఎద్దేవా చేశారు. అధికారం అడ్డం పెట్టుకొని గ్రానైట్ క్వారీలు, పాలిషింగ్ యూనిట్లు, మద్యం దుకాణాలు బినామీల పేర్లుతో ఏర్పాటు చేసుకొని దోచుకుంటున్నారన్నారు. మంత్రిగా ఉంటూ తన అన్నతో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించి, గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలతో బెల్టు షాపులు నడుతున్న అచ్చెన్నాయుడికి మెడికల్ కాలేజీల పీపీపీ విధానం నచ్చుతుందని ఆరోపించారు. ఇప్పటికై నా టెక్కలి నియోజకవర్గ ప్రజలకు మేలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి యర్ర చక్రవర్తి, మండల పార్టీ అధ్యక్షుడు తమిరె పాల్గుణరావు, చిన్ని జోగారావు, కురమాన బాలకృష్ణారావు, అక్కురాడ లోకనాథ తదితరులు పాల్గొన్నారు.