
కూటమి పాలనా వైఫల్యాలపై గళమెత్తాలి
● నవంబర్ 20లోగా మండల, గ్రామ, వార్డు స్థాయి కమిటీలు పూర్తి చేయాలి
● వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్షలో నేతల పిలుపు
సాక్షి, విశాఖపట్నం:
కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై గళమెత్తాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా యువజన విభాగం పోరాడాలని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఎండాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ ఇన్‌చార్జి అంబటి శైలేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు హాజరయ్యారు. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదీప్‌రాజ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రానున్న రోజుల్లో గ్రామ, మండల యువజన విభాగం కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. వారి సూచనలు, సలహాల మేరకు యువజన విభాగ కమిటీలను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. అంబటి శైలేష్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మండల, గ్రామ, వార్డు స్థాయిలో యువజన విభాగ కమిటీలను నవంబర్ 20 లోపు పూర్తి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలే లక్ష్యంగా మీ పరిధిలో సమస్యలు, ప్రజా సమస్యలపై పోరాడి.. వాటిని ప్రభుత్వం పరిష్కరించే వరకూ శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించాలని తెలిపారు. రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేసిందని ఆరోపించారు. వీటిపై పోరాటం చేయడంలో యువజన విభాగం ఎప్పుడూ ముందుండాలని సూచించారు. విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కార్పొరేటర్ ఉరుకూటి చందు మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి అనుబంధ కమిటీల్లో అత్యంత ప్రధానమైనది యువజన విభాగం.. అలాంటి విభాగంలో ఉన్న మనమందరం పార్టీ బలోపేతంలో ముఖ్య భూమిక పోషించాలన్నారు. మన రాజకీయ భవిష్యత్తులో ముందుకు దూసుకెళ్లడానికి ప్రధాన మార్గం కూడా ఇదే అవుతుందని, పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని విజయవంతం చేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్(అనకాపల్లి), శరత్‌బాబు(పార్వతీపురం), పృథ్వీరాజ్(శ్రీకాకుళం), అల్లు అవినాష్(విజయనగరం), గాబడి శేఖర్(అల్లూరి), రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి, కార్పొరేటర్ ఇమ్రాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలిశెట్టి సురేష్ రాజ్, దొడ్డి కిరణ్, కార్యదర్శులు చింతకాయల వరుణ్, జగుపిల్ల నరేష్, కనకాల ఈశ్వర్ రావు, సత్యం నాయుడు, శివాజీ చక్రవతి, వివిధ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.