
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష
జలుమూరు: కార్తీక మాసంలో శ్రీముఖలింగం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో బందోబస్తు నిర్వహించాలని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. నెల రోజుల పాటు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, అందువలన ఉచిత ప్రసాదం, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లపై గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ విస్తరణ అధికారులు, ఎంపీడీవోలకు పలు సూచనలు చేశారు. అలాగే క్యూలో భక్తులు ఎండలో ఉండకుండా నీడ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా భక్తులు ఈ ఏడాది అధిక సంఖ్యలో రానున్నారని, వీరి ప్రయాణానికి బస్సుల ఏర్పాట్లు చూడాలన్నారు. పారిశుద్ధ్య లోపం లేకుండా చూడడంతో పాటు మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌ను అదేశించారు. సమావేశంలో ఎంపీడీవో చిన్నమ్మడు, ఈవోపీఆర్డీ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.