
మంత్రి అచ్చెన్న ఆగ్రహం
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాల అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్‌రెడ్డి, ఏవో ప్రదీప్‌లపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళవారం ఆయన రిమ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, నిఘా, మెస్ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వైద్యాధికారులను ప్రశ్నించగా ప్రస్తుతం జాబ్ చార్ట్ మారిందని, మెగా పారిశుద్ధ్యం, మెస్ నిర్వహణ అన్ని అడ్మినిస్ట్రేటర్ పరిధిలో ఉన్నాయని మంత్రికి చెప్పారు. దీంతో అడ్మినిస్ట్రేటర్‌ను ప్రశ్నించగా ఆయన సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు తెలియజేయాలని కోరగా.. ఆ పుస్తకం తీసుకు రాలేదని అడ్మినిస్ట్రేటర్, ఏవోలు చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. మంత్రి సమీక్షకు వస్తున్నారని తెలిసిన తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఇద్దరూ విధుల్లో చేరి ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు తనను కలవకపోవడమేంటని నిలదీశారు. ఆస్పత్రుల్లో నియామకాలు జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురాకపోవడాన్ని కూడా తప్పుపట్టారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు. అనంతరం గైనిక్ విభాగానికి వెళ్లి ఇటీవల సమకూర్చిన యంత్రాలను ప్రారంభించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సైతం అడ్మినిస్ట్రేటర్, ఏవోల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ, అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ఇకమీదట తాను ఎప్పటికప్పుడు రిమ్స్‌ను తనిఖీ చేస్తానని చెప్పారు. సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ రమేష్ నాయుడు, ఆర్‌ఎంవో డాక్టర్ సుభాషిణి, డిప్యూటీ ఆర్‌ఎంవో డాక్టర్ సీపీ శ్రీదేవి, వైద్యులు సనపల నరసింహమూర్తి, డాక్టర్ సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
నోటిఫికేషన్ రద్దు చేయండి
రిమ్స్ వైద్య కళాశాలలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు రిమ్స్ అధికారులను ఆదేశించారు. ప్రతీ నియామకానికి సంబంధించి రోస్టర్ విధానం అమలు చేయాలని, ఆ విధంగా చేశారా.. లేదా అని మంత్రి ప్రశ్నించగా అడ్మినిస్ట్రేటర్, ఏవోలు తమకు గుర్తు లేదని, పరిశీలించాల్సి ఉందని వింత వింత సమాధానాలు చెప్పడంతో మంత్రి అవాక్కయ్యారు. తక్షణం నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. ఇకమీదట పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.