
మా సొమ్ము ఇచ్చేదెప్పుడు..?
ఇచ్ఛాపురం పోస్టాఫీస్ వద్ద ఆందోళన చేపట్టిన ఖాతాదారులు
సిబ్బందిని లోపలకు వెళ్లనీయకుండా గేటు వద్ద నిరసన
15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్న పోస్టల్ అధికారులు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పోస్టాఫీస్‌లో జరిగిన భారీ స్కామ్‌తో 34 మంది ఖాతాదారుల రూ.2.78 కోట్ల సొమ్ము మాయమైన సంగతి తెలిసిందే. మూడు నెలలుగా దీనిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో మంగళవారం బాధితులంతా పోస్టల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ గేటు బయట టెంట్లు వేసి సుమారుగా నాలుగు గంటల పాటు కార్యాలయ సిబ్బందిని కార్యాలయంలోనికి వెళ్లనీయకుండా అడ్డుపడ్డారు. పోస్టాఫీస్‌లో దాచుకొన్న సొమ్ముని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
స్థానిక పోస్టుమాస్టర్ షణ్ముఖరావు బాధిత ఖాతాదారులకు ఎంతగానో నచ్చచెప్పినప్పటికి ఖాతాదారులెవరూ వినలేదు. దీంతో చేసేదేమీ లేక పోస్టల్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ సోంపేట నుంచి స్థానిక పోస్టల్ కార్యాలయానికి చేరుకున్నారు. పోస్టల్ ఇన్‌స్పెక్టర్ కూడా బాధితులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికి స్పష్టమైన హామీ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని బాధితులు కోరడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఈ క్రమంలో పోస్టల్ ఇన్‌స్పెక్టర్, పోస్టల్ అసిస్టెంట్ డెరెక్టర్ రాజు, పోస్టల్ సూపరిండెంట్ హరిబాబుకి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. దీంతో పోస్టల్ ఉన్నతాధికారులు బాధిత ఖాతాదారులతో ఫోన్‌లో మాట్లాడారు. 15 రోజుల్లో అందరికీ న్యాయం చేస్తామని వాయిస్ మెసేజ్ పంపించారు. దీంతో ఖాతాదారులంతా తాత్కాలికంగా నిరసనను విరమిస్తున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే నిరసనలు ఉద్ధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో బాధిత ఖాతాదారులు చాట్ల లోహిదాస్, బాలరాజు, కిరణ్మయి, శ్రీను, మమాపాత్రో తదితరులు పాల్గొన్నారు.