
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఇచ్ఛాపురం రూరల్: భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామం లొద్దపుట్టిలో విషాదచాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని లొద్దపుట్టి గ్రామం అంబుగాం వీధికి చెందిన పిట్ట మోహనరావు, కుమారీల కుమారుడు పిట్ట వసంత్(32) కాకినాడలో చార్టర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తండ్రి మోహనరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ భారాన్ని మోస్తున్న వసంత్, ఈ ఏడాది మార్చి 7న ఇచ్ఛాపురం బెల్లుపడకు చెందిన సంధ్య ఉరఫ్ ఇందును వివాహం చేసుకున్నాడు. శనివారం అరకు విహార యాత్ర కోసం తన ద్విచక్ర వాహనంపై భార్య సంధ్యను తీసుకొని వెళ్తుండగా, ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంజరిగింది. ఈ ప్రమాదంలో వసంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలై చికిత్స పొందుతోంది. జాతీయ రహదారిపై ధర్మవరం గ్రామ సమీపంలో రొయ్యల మేత తీసుకెళ్తున్న వ్యాన్ మరమ్మతులకు గురికావడంతో నిలిపివేశారు. ఆగి ఉన్న వ్యాన్‌ను వసంతకుమార్ బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నవ దంపతులను మృత్యువు విడగొట్టిందని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి