
వసతిగృహాల పనులు వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో అత్యవసరంగా చేయాల్సిన పనులు వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న పనుల ప్రగతిపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని తొమ్మిది గురుకులాలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దుప్పలవలస (మైదానం పాత నిర్మాణాలు, రోడ్లు), శ్రీకాకుళం పెదపాడు (దోమతెరలు, డ్రైనేజీ, లీకేజీలు), ఆమదాలవలస (కొల్లివలస డార్మిటరీ, ప్రహరీ, శానిటేషన్, విద్యుత్), తామరపల్లి (ఆధునీకరణ, నీటి సరఫరా) హాస్టళ్లలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన నిధులపై చర్చించారు. కొల్లివలసలో మోడ్రన్ కిచెన్ కోసం రూ.15 లక్షలు, పలాసలో మరమ్మతులకు రూ.10 లక్షలు అవసరమని అధికారులు తెలియజేశారు. నందిగాం హాస్టల్‌లో రూ.1.79 కోట్లతో జరుగుతున్న డైనింగ్ కం కిచెన్ హాల్, తరగతి గదుల నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని గడువు విధించారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుంచి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని హాస్టల్స్‌లో పారిశుధ్యం, మంచినీటి సౌకర్యం సరిగా లేదని ఫిర్యాదులు రావడంతో, ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ విషయంలో జాప్యం, నాణ్యతలో రాజీ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఈఈ బి.రామకృష్ణ, డీఈఈ బి.శ్రీరాములు, జిల్లా కో ఆర్డినేటర్ వై.యశోద లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.