
తప్పులతడకగా రీ సర్వే
● నరసన్నపేటలో తహసీల్దార్
కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
నరసన్నపేట: భూ సమస్యలను పరిష్కరించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేను కూటమి ప్రభుత్వం సక్రమంగా నిర్వహించడం లేదని, ఇప్పుడు కూడా భూములపై తమకు హక్కులు కల్పించరా.. అంటూ చెన్నాపురం, నడగాంకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి లోపల బైఠాయించారు. ఎన్నో ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న రీ సర్వేలో కూడా హక్కులు కల్పించకపోతే ఎలా అని అధికారులను నిలదీశారు. వెబ్‌ల్యాండ్ ప్రకారం, అడంగల్ ప్రకారమే మళ్లీ పేర్లు వస్తున్నాయని, ఒకరి పొలం మరొకరి పేరున వస్తుందని.. అసలు పొలమే లేని వారిపేరున ఎకరాలు చూపుతున్నారని ఆందోళన చెందారు. భూములు అమ్ముకున్న వారి పేరిటే మళ్లీ భూమి హక్కులు కనిపిస్తున్నాయని, ఇష్టానుసారంగా రైతుల పేర్లు మార్చేశారని రైతులు కె.రమణమూర్తి, గొనపు బాబూరావు, సనపల సూరిబాబు, దుప్పట్ల రాజశేఖర్, ధర్మారావు, రమణ, బాబ్జీ, కొంక్యాన నర్శింహమూర్తి, చిట్టిబాబు తదితరులు వాపోయారు. రికార్డులు సక్రమంగా తీర్చిదిద్దాలని, మళ్లీ రీ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, నిబంధనల మేరకే రీ సర్వేలో భూహక్కులు కల్పిస్తున్నామని, మీరు అనుకున్న విధంగా హక్కులు కల్పించమంటే తమవల్ల కాదని తహసీల్దార్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ పి.శ్రీనివాసరావులు చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. గ్రామానికి వస్తామని, తప్పులుంటే నిబంధనల మేరకు సరిచేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు.