
వ్యాధుల కాలం... జీవాలు భద్రం..!
అవగాహన కల్పించాలి
శిబిరాలతో సరిపెడుతున్నారు
సరుబుజ్జిలి: ఇటీవల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల వర్షపు నీరు చేరింది. మనుషులు మాదిరిగా పశువులకు కూడా అనేక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందువలన సీజనల్‌గా వచ్చే వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పలు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పశువులకు వచ్చే సీజనల్ వ్యాధులను పరిశీలిస్తే...
చిటుకు వ్యాధి
వర్షాకాలంలో గొర్రెలకు చిటుకు వ్యాధి బాక్టీరియా వలన అధికంగా వస్తుంది. దీనివలన ఉన్నటుండి గాలిలో ఎగిరి గొర్రెలు చనిపోతాయి. దీనికోసం ముందుగా నీరసంగా ఉన్న గొర్రెలను మంద నుంచి వేరుచేయాలి. వ్యాధి నివారణకు పెన్సిలిన్ వేయించాలి. వ్యాధిసోకని వాటికి వ్యాక్సిన్ వేయించాలి.
నీలి నాలుక
నీలి నాలుక గొర్రెలు, మేకల్లో వస్తుంది. ఈ వ్యాధి సోకిన జీవాలకు జ్వరంగా అధికంగా వస్తుంది. నోటి నుంచి చొంగ కారుస్తూ, గిట్టలకు పుండ్లు ఏర్పడతాయి. ఈ వ్యాధి నివారణకు యాంటీ బయాటిక్స్, లివర్ టానిక్ ఉపయోగించి జీవాలను మంద నుంచి వేరు చేయాలి.
గొంతువాపు వ్యాధి
ఈ వ్యాధి అన్ని వయస్సుల ఆవులు, గేదెల్లో కనిపిస్తుంది. 105 నుంచి 108 డిగ్రీల జ్వరం వస్తుంది. నోటి నుంచి చొంగలు కారుస్తూ.. నోటి నుంచే గాలి పీల్చుకుంటాయి. గొంతవద్ద వాపు వలన మేత తీసుకోలేవు. నివారణకు సల్పాడిమిడిన్ వాడుతూ, 4 నెలలు దాటిన జీవాలకు వ్యాక్సినేషన్ చేయించాలి.
గాలికుంటు వ్యాధి
ఇది అన్ని జీవాల్లో కనిపిస్తుంది. నోరు, గిట్లలో పుండ్లు ఏర్పడి ఎక్కువగా జ్వరం ఉంటుంది. నివారణకు బోరిక్ గ్లిజరిన్ ఆయింట్‌మెంట్‌ను నోటిలో పూత పూయాలి. పీపీ ద్రావణంతో కాలిగిట్ల మధ్య శుభ్రం చేయాలి. ప్రతిఏటా ముందస్తుగా ఏప్రిల్, మే నెలల్లో వ్యాక్సిన్ వేయించాలి.
పశుసంవర్ధక శాఖ అధికారులు దిగువ స్థాయిలో సిబ్బందిపై పశువైద్య సేవల బాధ్యతలు పెట్టకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తే సమస్యలు గుర్తించవచ్చు. సీజనల్‌గా వచ్చే వ్యాధులు గురించి పాడి రైతులకు గ్రామాల్లో అవగాహన కల్పించాలి. సిబ్బంది పనితీరు మెరుగుపరచాలి.
– పైడి మోహనరావు, మతలబుపేట, సరుబుజ్జిలి
పశువైద్య శాఖ అధికారులు అడపాదడపా పశువైద్య శిబిరాలు పెట్టి తమ బాధ్యత తీరిందన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పశువుల పెంపకం, సంక్రమించే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించాలి. లంపిస్కిన్ వ్యాధితో అప్పట్లో చాలావరకు పశు నష్టాలు చవిచూశాం.
– చల్ల యర్రయ్య, చిగురువలస, సరుబుజ్జిలి

వ్యాధుల కాలం... జీవాలు భద్రం..!

వ్యాధుల కాలం... జీవాలు భద్రం..!