
అధికారులందరూ హాజరవ్వాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● పీజీఆర్‌ఎస్‌కు 92 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా ప్రజా సమస్యల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు ప్రతి సోమవారం హాజరవ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పలువురు క్రిందిస్థాయి అధికారులు వస్తూ సమస్యలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారన్నారు. అందువలన ప్రతీశాఖ నుంచి బాధ్యతాయుతమైన, సమాధానం తెలిసిన అధికారి హాజరవ్వాలని స్పష్టం చేశారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదుల తక్షణ పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అనంతరం కొన్ని వినతులు స్వీకరించి కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే సమావేశానికి వెళ్లారు. ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్‌వో ఎం.వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. మొత్తం 92 వినతులు స్వీకరించినట్లు అధికారులు తెలియజేశారు.
వినతులు పరిశీలిస్తే..
● సీజేఐ గవాయ్‌పై దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు టి.శ్రీనివాస్, ఎల్.తేజేశ్వరరావు, డి.తిరుపతి తదితరులు ఫిర్యాదు చేశారు.
● ఆక్రమణదారుల నుంచి రక్షించి తమ భూములు ఇప్పించాలని ఆమదాలవలస మండలంలోని దూసి గ్రామానికి చెందిన దళితులు కోరారు. కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణదారుల కబ్జాకు గురైన డీ–పట్టా భూములను ఇప్పించాలని 17 దళిత కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల్లో ఎడ్ల కల్యాణి, బొంతల లత, ఎం.లక్ష్మి, యారబాటి పార్వతి, కలివరపు శ్రీలత, యారబాటి రాములమ్మ, అన్ను లక్ష్మి, బొడ్డేపల్లి లక్ష్మీ భవానీ, బొడ్డేపల్లి లక్ష్మి, మన్యాల రామారావు తదితరులు ఉన్నారు.
●శ్రీకాకుళం నగరంలోని బాదుర్లుపేట దరి వాంబే కాలనీకి చెందిన మెండ రాములు తనకు ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం ఇప్పించాలని కోరారు.
● లావేరు మండలంలోని చిన్నయ్యపేట గ్రామానికి చెందిన కలిశెట్టి రాములు తనకు, తన కుటుంబానికి తన కోడలు మరికొంతమంది కలిసి వేధిస్తున్నారు. తన ఆస్తిని, ఇతర వస్తువులను తీసుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.
● తమను డీఎస్సీ ద్వారా నిబంధన మేరకు ఉద్యోగ నియమకాలు చేసినప్పటికీ, సుమారుగా 12 వందల మందిని విధుల నుంచి తొలగించారని, తిరిగి జీవో 12–7 ప్రకారం విధుల్లోకి తీసుకోవాలని హెల్త్ అసిస్టెంట్లు కోరారు.