
థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు సరికాదు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఆదివాసీల సంస్కృతి, పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీసే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు సరికాదని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర అన్నారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో వెన్నెలవలసలో 3,200 మెగావాట్స్ సామర్ధ్యంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏపీ జెన్‌కో నిర్మాణ ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు జరిగితే రెండు మండలాల్లోని 20 గిరిజన గ్రామాల్లో ఉన్న సుమారు 5 వేల మంది గిరిజనుల జీవనాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం వలన హిరమండలం వంశధార ప్రాజెక్ట్ పరిధిలో ఆధారపడిన వేల మంది రైతులు సాగునీరు అందక పంటపొలాలు బీడు భూములుగా మారిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. చుట్టుపక్కల నీరు, గాలి కాలుష్యానికి గురవుతాయన్నారు. ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో కలపాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయనతో పాటు జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎన్.అప్పన్న, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.జైరాం, మండల నాయకులు ఎస్.ప్రసాద్, ఎస్.శంకయ్య తదితరులు ఉన్నారు