
నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నవంబర్ 3వ తేదీ నుంచి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని ఏఐటీయూసీ కౌన్సిల్ సభ్యుడు టి.తిరుపతిరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్యాణి అప్పలరాజు తెలిపారు. కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావుకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరష్కరించాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో గత రెండు సంవత్సరాలుగా చనిపోయిన, రిటైరైన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు తిరిగి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉపాధి కల్పించాలని కోరారు. 12వ పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మధ్యంతర భృతి 30 శాతం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు డి.రమణ, ఆర్.గణేష్, సీతమ్మ, రామచంద్ర, ఢిల్లి తదితరులు పాల్గొన్నారు.