
రైతు ఖాతాకు ఐదారు గంటల్లోనే ధాన్యం సొమ్ము
● మంత్రి నాదెండ్ల మనోహర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో కాకుండా, కేవలం ఐదు నుంచి ఆరు గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో రైస్ మిల్లర్స్, వివిధ రైతు సంఘాలు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. తేమ శాతం పరీక్షల్లో ఏకరూపత కోసం రైతు సేవా కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ఒకే కంపెనీకి చెందిన యంత్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలలో గతంలో 11.45 లక్షల టన్నులు కొనుగోలు చేయగా, ఈసారి లక్ష్యాన్ని 13 లక్షల టన్నులకు పెంచినట్లు తెలిపారు. రైతులు నమ్మకం ఉన్న చోట ధాన్యం విక్రయించే వెసులుబాటు తీసుకువచ్చిందన్నారు. అలాగే నూరు శా తం సబ్సిడీతో రైతులకు టార్పాలిన్లను అందిస్తామని, శ్రీకాకుళంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపా రు. ఉత్తరాంధ్రలో వారం రోజుల్లోపే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, చైర్మన్, ఎండీ మనజీర్ జిలానీ సమూన్, డైరెక్టర్ గోవిందరావు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.