
పోలీసుల తీరు సరికాదు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పలాస నియోజకవర్గంలో మరింత ఎక్కువగా పోలీసు అధికారులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆరోపించారు. తప్పకుండా న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. టీడీపీ నేతలు చెప్పినట్టు ఆడుతున్న అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చారని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూడా అక్రమ కేసు పెట్టడం దారుణమన్నారు. ర్యాలీ చేస్తే తప్పుడు కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. తప్పుడు ఫిర్యాదులు చేయించి, హత్యాయత్నం కేసులు కూడా పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. కేసు లు ఎదుర్కొంటున్న వారికి, పోలీసుల వేధింపులకు గురవుతున్న వారికి వైఎస్సార్‌సీపీ పార్టీ అండగా నిలుస్తుందని కన్నబాబు భరోసానిచ్చారు.
● న్యాయపోరాటం చేస్తాం
● వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు