
పురపాలికల్లో.. పడకేసిన పారిశుద్ధ్యం
● పేరుకుపోతున్న చెత్త కుప్పలు
● పలుచోట్ల తూతూమంత్రంగా చెత్త సేకరణ
● పట్టణవాసులకు తప్పనిపాట్లు
పురపాలక సంస్థల పరిధిలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస మున్సిపాలిటీల్లో చెత్తాచెదారాలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. రోజుల తరబడి ఇదే పరిస్థితి ఉండటంతో కుక్కలు, పశువులు, పందువులు చేరి పరిసరాలను చిందరవందరగా మార్చుతున్నాయి. చెత్త సేకరణకు సంబంధించి డంపర్ బిన్లు పాడైపోవడంతో నిర్వహణ కష్టంగా మారిందని సిబ్బంది చెబుతుండగా.. దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానికులు, అటువైపుగా వెళ్లే వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పురపాలక సంస్థల పరిధిలో పారిశుద్ధ్యంపై ‘సాక్షి’ ఫోకస్..
శ్రీకాకుళం కార్పొరేషన్‌లో..
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):
నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడికక్కడ చెత్తకుప్పులు పేరుకుపోతుండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. కార్పోరేషన్ పరిధిలో విలీన పంచాయతీలతో కలిపి 50 డివిజన్లు ఉన్నాయి. అందులో 1.85లక్షలు మంది జనాభా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో క్లీన్‌ఆంధ్రప్రదేశ్ వాహనాలు 50 ఉండేవి. వీటికి అదనంగా రెండు వాహనాలు అందుబాటులో ఉండేవి. ప్రతిరోజూ తెల్లవారుజామున 5గంటలకే ఇంటి ముంగిటకు వాహనాలు వచ్చి చెత్త సేకరించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. వాహనాలు 40 కంటే తక్కువగానే ఉన్నాయి. అందులో కొన్ని రిపేర్లుకు గురికావడం, డ్రైవర్లు సరిగా లేకపోవడం, వాహనాలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వంటి ఇబ్బందు వల్ల పారిశుద్ధ్యం పడకేసింది. తడి చెత్తకు వేరేగా...పొడి చెత్తకు వేరేగా డస్ట్‌బిన్‌లు కార్పొరేషన్ సరఫరా చేసేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఫోటోలకు ఫోజులిచ్చి మమా అనిపించేస్తున్నారు తప్ప పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు.