
చైన్‌స్నాచింగ్ ముఠా అరెస్టు
● నిందితులంతా ట్రాన్స్‌జెండర్లే
● 38 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం
నరసన్నపేట: ఉత్తరాంధ్రతో పాటు పలుచోట్ల ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న పురుషులే లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ట్రాన్స్‌జెండర్స్ ముఠాను నరసన్నపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు శుక్రవారం నరసన్నపేటలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇటీవల నరసన్నపేట మండలం ఉర్లాం సమీపంలో నడగాంకు చెందిన దొంపాక ఆనందరమణను కొందరు ట్రాన్స్‌జెండర్ల అడ్డగించి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా ముఠా పట్టుబడింది. ఉర్లాంతో పాటు ఇచ్ఛాపురం, జి.సిగడాం మండలం ఉల్లివలస జంక్షన్, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబల్లి మండలం సంకిలిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. బైక్‌లపై వచ్చిన వారి మెడలో నుంచి బంగారు చైన్లు లాక్కోని సమీపంలో ఉన్న కారులో వీరు పారిపోతుంటారు. ఈ కేసులో తెర్లాం మండలం పిరిడి గ్రామానికి చెందిన నందిగామ నేహా, కాకినాడ జిల్లా రేచర్లపేటకు చెందిన మండల శ్రావణి, పార్వతీపురం జిల్లా వీరఘట్టంకు చెందిన అలుబిల్లి ప్రియ, రంపచోడవరం ప్రాంతానికి చెందిన బేదంపూడి సాయిపల్లవి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన నాగిరెడ్డి సుష్మలతో పాటు వీరికి సహాయకారిగా ఉన్న కారు డ్రైవర్ తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన సేలం రాంప్రవీణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ మడపాం టోల్‌గేట్ వద్ద శుక్రవారం పట్టుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. వీరి వద్ద నుంచి 38 గ్రాముల బరువున్న మూడు బంగారు చైన్లు రికవరీ చేశారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, నరసన్నపేట, పోలాకి ఎస్‌ఐలు సీహెచ్ దుర్గాప్రసాద్, రంజిత్‌లు కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నందుకు డీఎస్పీ అభినందించారు.