గంజాయి తెగులు..! | - | Sakshi
Sakshi News home page

గంజాయి తెగులు..!

Sep 16 2025 8:46 AM | Updated on Sep 16 2025 8:46 AM

గంజాయి తెగులు..!

గంజాయి తెగులు..!

● చిక్కోలుకు...

చాపకింద నీరులా విస్తరిస్తున్న వైనం

ఇతర ప్రాంతాల్లోని యూనివర్సిటీలు, స్టడీ సెంటర్లలో విక్రయం

ఇటీవల దొరికిన 10 మంది నిందితులు

శ్రీకాకుళం క్రైమ్‌/రణస్థలం:

డిశాలో పుట్టిన గంజాయి వనం.. సిక్కోలు జిల్లాలో విస్తరిస్తోంది. ఈ గంజాయి ప్రముఖ యూనివర్సిటీలు, కాంపిటేటివ్‌ కోచింగ్‌ సెంటర్లలో చదువుకునే విద్యార్థులే లక్ష్యంగా చేరుతోంది. ఒడిశా సాగుదారుని నుంచి రూ.1,500లు, రూ.2,000ల ధరకు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో డిమాండ్‌ ఆధారంగా రూ.50 వేల వరకు అమ్ముతున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. సరదాగా గంజాయి తాగడంతో మొదలవుతున్న జీవితాలు దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు, హత్యాయత్నాలు, హత్యలు చేసే స్థాయికి దిగజారుతున్నాయి. దీంతో అనేక కుటుంబాలు తీవ్ర వేదనకు గురవుతున్నాయి. తాజాగా జేఆర్‌పురం పోలీసులకు పట్టుబడిన 10 మంది నిందితుల్లో ఐదుగురిని విచారించగా దీని వెనక పెద్ద లింకే ఉందని తెలుస్తోంది. ప్రధానంగా కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్‌ సెంటర్ల వద్ద విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని భారీ ధరలకు విక్రయాలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సీఐ ఎం.అవతారం పర్యవేక్షణలో ఎస్‌ఐ చిరంజీవి ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు.

ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో..

పట్టుబడిన పదిమంది నిందితుల్లో ఐదుగురు కొనుగోలుదారులు కాగా.. మరో ఐదుగురు కొనుగోలు చేయడంతో పాటు వాటిని సరఫరా చేసేవారిగా ఉన్నారు. అందరూ పాతికేళ్లలోపు యువకులే. వీరిలో ఎచ్చెర్ల మండలం కుశాలపురానికి చెందిన బగాన పవన్‌కుమార్‌దే కీలక పాత్ర. ఒడిశా రాష్ట్రం కొరాపూట్‌ జిల్లా పొత్తంగికి చెందిన గుంత శుక్ర వద్ద కిలో గంజాయి రూ.7 వేల లెక్కన ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి, పట్టుబడిన మిగతా నిందితులతో పాటు తన నెట్‌వర్క్‌లో ఉన్నవాళ్లకు సరఫరా చేస్తుంటాడు. గంజాను ప్యాకెట్లుగా విడదీసి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌, కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్‌ వరకు వ్యాపారం చేసేందుకు కూడా వెళ్తాడు. కిలో రూ.7 వేలకు తనకొచ్చే గంజాయిని రూ.10 వేలు నుంచి రూ.15 వేల వరకు జిల్లాలో అమ్ముతాడు. బెంగుళూర్‌, హైదరాబాద్‌ల్లో అయితే రూ. 25 వేలు నుంచి రూ. 30 వేలు వరకు అమ్ముతాడు. ఇతని తర్వాత విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొత్త కొప్పెర్లకు చెందిన ఇనకోటి ముకుంద సహాయకారిగా ముఖ్యపాత్ర పోషిస్తాడు. ఒడిశాకు పవన్‌తో పాటు వెళ్లడం, మాల్‌ తీసుకొని వచ్చి వారి గ్రామం, చుట్టుపక్కల గ్రామస్తులకే కాకుండా విజయవాడ వరకు వెళ్లి ముఖ్య ప్రాంతాల్లోని కొన్ని యూనివర్సిటీలు, కళాశాలల విద్యార్థులకు కొందరిని లింక్‌గా చేసుకుని విక్రయాలు చేస్తాడు.

ముగ్గురు మిత్రులు

శ్రీకాకుళం పెద్దరెల్లివీధికి చెందిన తుపాకుల అనిల్‌కుమార్‌ విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెంలో చదువుకుంటున్నాడు. ఇతను బగాన పవన్‌ దగ్గర గంజా కొనుక్కొని తాటిచెట్లపాలెంలో ఫ్రెండ్స్‌కు అమ్ముతుంటాడు. అలాగే ఎచ్చెర్ల సాయినగర్‌కు చెందిన లక్కవరపుకోట పవన్‌కుమార్‌, జోగేంద్రప్రసాద్‌లు మిత్రులు కావడంతో వారితో కలిసి గంజాయి సేవించడం చేస్తుంటాడు. ఆపై తమ తమ గ్రామాల్లో, వేరే గ్రామాల్లోని ఫ్రెండ్స్‌కు గంజాను అధిక రేటుకు అమ్ముతుంటారు.

ఆ ముగ్గురూ దొరికితే..

అయితే పోలీసుల దర్యాప్తులో పట్టుబడిన నిందితులు మరో ముగ్గురి పాత్రపై గుట్టువిప్పారు. వీరిలో శ్రీకాకుళం నగరానికి చెందిన బగాన సౌమిత్‌ హైదరాబాద్‌లో కాంపిటేటివ్‌ కోర్సుకై కోచింగ్‌ నిమిత్తం వెళ్లాడని, అక్కడ ఒక ప్రముఖ యూనివర్సిటీలో విద్యార్థులకు గంజాను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఎచ్చెర్లకు చెందిన మరో యువకుడు మొదలవలస సందీప్‌ బెంగుళూర్‌లో చదువుతున్నాడని, అక్కడ డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థుల కోచింగ్‌ సెంటర్ల వద్దకు వెళ్లి గంజా అమ్ముతుంటాడు. వీరిరువురూ అక్కడుండే డిమాండ్‌ ఆధారంగా కిలో గంజాయిని చిన్న, చిన్న ప్యాకెట్లుగా చేసి సుమారు కిలో రూ.50 వేలు పైబడి అమ్ముతారు. శ్రీకాకుళం ఇంటికి వచ్చినప్పుడు బగాన పవన్‌కుమార్‌ వద్ద రెండు కిలోల నుంచి నాలుగు కిలోల వరకు కొనేసి హైదరాబాద్‌, బెంగుళూర్‌ పట్టుకుపోతారు. కొన్నిమార్లు ఒడిశా కూడా వెళ్లి కొంటారు. మరో కీలక యువకుడు జోగేంద్రప్రసాద్‌ బగాన పవన్‌కుమార్‌తో కలిసి బెంగుళూర్‌ తరచూ మాల్‌ పట్టుకు వెళ్తుంటాడని, ఫ్రెండ్‌ సర్కిల్‌తో దూకుడుగా ఉంటూ ఎచ్చెర్ల పరిసరాల్లో గట్టిగా గంజా తాగి హల్‌చల్‌ చేస్తుంటాడని చెబుతున్నారు. వీరి ముగ్గురిని పట్టుకుంటే వెనకుండే మరికొన్ని లింక్‌లు దొరకొచ్చనే భావనలో పోలీసులున్నారు.

చిత్ర విచిత్ర పేర్లతో..

గంజాయి విక్రయాలు, కొనుగోళ్లలో వీరిని చిత్ర, విచిత్ర పేరులతో పిలుస్తుంటారు. ఒడిశాకు చెందిన గుంత శుక్ర మారుపేరు భత్రి కాగా, జోగేంద్రప్రసాద్‌ మారుపేరు డ్యానీ, పట్టుబడిన కొనుగోలుదారుల్లో ఆళ్లవెంకటరావు మారుపేరు కొత్త సైకిల్‌, సురవరపు ప్రసాద్‌ మారుపేరు డీజేలుగా చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement