
● పాఠశాలను తరలిస్తే సహించేది లేదు
బూర్జ: మండలంలోని అల్లెన గ్రామ ఎంపీయూపీ పాఠశాలను గ్రామంలోనే కొనసాగించాలని, వేరే పాఠశాలకు తరలిస్తే సహించేది లేదని గ్రామ సర్పంచ్ జడ్డు మహేష్‌తో పాటు పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. దీంతో ఎంఈవోలు ఎన్.శ్యామసుందరరావు, బి.ధనుంజయరావు కలగజేసుకొని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో డీఈవో ఎ.రవిబాబు, డిప్యూటి డీఈవో ఆర్.విజయకుమార్‌లు వచ్చి గ్రామస్తులకు నచ్చజెప్పారు. పాఠశాలను గ్రామంలో కొనసాగిస్తామని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులంతా ఆందోళన విరమించి హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ మురపాక శంకరరావు, సరుబుజ్జిలి పోలీసుస్టేషన్ ఎస్‌ఐ బి.హైమావతి తదితరులు పాల్గొన్నారు.