
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై మార్కెట్ కమిటీ చైర్మన్ దాడి
జలుమూరు: శ్రీముఖలింగంకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త చింతం రాంబాబుపై జలుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తర్ర బలరాం, సోదరుడు కృష్ణ గురువారం దాడి చేసి గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. గతంలో రాంబాబు తన వీధిలో వైఎస్సార్ సీపీ బ్యానర్ కట్టగా బలరాం తొలగించేందుకు ప్రయత్నించాడు. అప్పట్లో అది వివాదంగా మారింది. పాత కక్షల నేపథ్యంలో గురువారం శ్రీముఖలింగంలో వేరే గొడవ జరుగుతుండగా అదే చోటకు వచ్చి తనపై దాడి చేశారని, కర్రతో తలపై బలంగా కొట్టారని రాంబాబు ఆరోపించారు. దీనిపై జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అనంతరం బుడితి సీహెచ్‌సీలో చికిత్స తీసుకున్నానని పేర్కొన్నారు. జూలైలో ఇదే మార్కెట్ కమిటీ చైర్మన్ బలరాంతోపాటు మరి కొందరు సామాజిక కార్యకర్త, అర్చకుడు నాయుడుగారి రాజశేఖర్‌పై కూడా దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పోలీసులు సరిగా వ్యవహరించకపోవడంతో రాజశేఖర్ ఢిల్లీ వెళ్లి మానవ హక్కుల కమిషన్‌తో పాటు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఇది విచారణలో ఉండగా మళ్లీ ఈ గొడవ జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు ఫిర్యాదుపై జలుమూరు ఎస్.ఐ అశోక్‌బాబు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
14న జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మధుసూదనరావు, ఎం.సాంబమూర్తి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఉదయం 9 గంటలకు మొదలవుతాయని చెప్పారు. ఎంపికై న క్రీడాకారులను ఈ నెల 27 నుంచి 29 వరకు ఏలూరు జిల్లా అల్లూరి సీతారామరాజు స్టేడియం వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్‌జిల్లాల) జూనియర్స్ బాలబాలికల అథ్లెటిక్స్ చాంపియన్స్ పోటీలకు పంపించనున్నట్టు పేర్కొన్నారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో జరిగే ఈ ఎంపికలకు 2005 అక్టోబర్ 15 నుంచి 2013 అక్టోబర్ 14 మధ్య జన్మించిన వారు అర్హులని స్పష్టంచేశారు. వివరాలకు 8500271575 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.