
క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ గుర్తింపు
ఎచ్చెర్ల : ఆర్‌జీయూకేటీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ గుర్తింపు లభించింది. ఐబీఎం క్వాంటమ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చి క్విస్కిట్‌ఫాల్ ఫెస్ట్–2025 నిర్వహించేందుకు శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని ఎంపిక చేసింది. ఈ మేరకు డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 1,300 విశ్వవిద్యాలయాల నుంచి కేవలం 55 వర్సిటీలు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాయని చెప్పారు. యేల్ యూనివర్శిటీ, యూసీఎల్‌ఏ, ఐఐటీ మద్రాస్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో పాటు ఆంధ్రప్రదేశ్ తరఫున ఆర్‌జీయూకేటీ ఐఐఐటీ శ్రీకాకుళం ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఫెస్ట్ నిర్వహణ బృందంగా కటం నిఖిల్‌తేజ, కాశిం, వాలి, దుదేకుల ప్రవీణ్‌కుమార్, చెరుకూరి జాన్‌బాబు, చదువుల గుణశ్రీ కిమ్మిడి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ మునిరామకృష్ణ, అకడమిక్స్ డీన్ డాక్టర్ శివరామకృష్ణ, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, ఫైనాన్స్ అధికారి డాక్టర్ వాసు, హెచ్‌ఓడీ రమేష్‌బాబు, పీఆర్‌వో షణ్ముఖరావు తదితరులు అభినందించారు.