
హా..స్టళ్లు..!
● పాడుబడిన భవనాలతో అవస్థలు
● కురిగాం, కొత్తూరు వసతి గృహాల్లో చేరని విద్యార్థులు
కొత్తూరు: విద్యార్థుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వ ప్రకటనలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా ఉంది. దీనికి నిదర్శనంగా కొత్తూరు మండలం కురిగాం గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహం, కొత్తూరులోని ఎస్సీ బాలికల వసతి గృహాలను చెప్పుకోవచ్చు. ఈ వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది వేసవి సెలవుల అనంతరం ఇప్పటివరకు ఈ వసతి గృహాల్లో విద్యార్థులు చేరలేదు. దీంతో ఖాళీ భవనాలు దర్శనమిస్తున్నాయి.
భయపెడుతున్న శిథిల భవనాలు
కొత్తూరు ఎస్సీ బాలికల వసతి గృహం బాగా పాతబడిపోవడంతో విద్యార్థులు వసతి గృహంలో ఉండేందుకు భయపడుతున్నారు. వర్షాలు వచ్చే సమయంలో ఈ వసతి గృహం ముందు ఉన్న రోడ్డు మీదకు నీరు చేరి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వసతి గృహానికి వెళ్లే రహదారి సైతం అధ్వానంగా ఉంది. అలాగే పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వలన వసతి గృహానికి వచ్చేందుకు విద్యార్థులు ఇష్టపడడం లేదు. అదేవిధంగా కురిగాం వసతి గృహం గదులు బీటలువారి ప్రమాదపుటంచున ఉన్నాయి. ఇక్కడ గదులకు తలుపులు లేవు. వర్షం వస్తే నీరు కారుతోంది. దీంతో ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఫలితంగా రెండు వసతి గృహాల్లో ప్రస్తుతం విద్యార్థులు చేరలేదు. గత విద్యా సంవత్సరంలో కొత్తూరు ఎస్సీ బాలికలు వసతి గృహంలో 18 మంది విద్యార్థులు ఉండేవారు. అయితే వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు రాకపోవడంతో వసతి గృహానికి తాళం వేశారు. కురిగాం వసతి గృహంలో గత విద్యా సంవత్సరంలో 11 మంది విద్యార్థులు ఉండేవారు. సెలవులు తర్వాత విద్యార్థులు మరెవ్వరూ రాలేదు. ఫలితంగా ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఈ రెండు వసతి గృహాలు మూతపడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ రెండు వసతి గృహాల్లో నాల్గో తరగతి సిబ్బంది ఒక్కక్కొరు పనిచేస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
కొత్తూరు, కురిగాం ఎస్సీ బాలికల, బాలుర వసతి గృహాల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని వార్డెన్లకు ఆదేశించాము. ఇప్పటికే వార్డెన్లు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. కురిగాంలో భవనాలు పాడవ్వడంతో వసతి గృహంలో చేరేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. అలాగే కొత్తూరులో వార్డెన్ లేకపోవడంతో పక్కన ఉన్న వార్డెన్‌కు ఎఫ్‌ఏసీ ఇవ్వడం వలన అడ్మిషన్లపై దృష్టి సారించలేకపోయారు. విద్యార్థులు వచ్చినట్లయితే వసతి గృహాల్లో చేర్పించుకుంటాము.
– శ్యామల, ఏఎస్‌డబ్ల్యూ, పాతపట్నం

హా..స్టళ్లు..!