
14న జిల్లా జూనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జూనియర్స్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్టు జిల్లా కబడ్డీ సంఘ అధ్యక్షుడు నక్క కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సాదు ముసలినాయుడు బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియం సమీపంలో ఉదయం 9 గంటలకు ఎంపికలు మొదలవుతాయని చెప్పారు. 2006 జనవరి 1 తర్వాత జన్మించిన బాలబాలికలు, బాలురు 70 కేజీలులోపు, బాలికలు 65 కేజీల్లోపు వయస్సు ఉండాలని స్పష్టం చేశారు. మ్యాట్‌పై జరిగే ఈ ఎంపికలకు క్రీడాకారులు షూ ధరించి హాజరుకావాలని కోరారు. ఎంపికై న జిల్లా జట్లను కృష్ణా జిల్లా విజయవాడ వేదికగా జరిగే రాష్ట్రస్థాయి జూనియర్స్ కబడ్డీ చాంపియన్‌షిప్–2025 పోటీలకు పంపిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు(9441914214)ను సంప్రదించాలని కోరారు.
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం క్రైమ్ : గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళల అదృశ్యం కేసులపై పోలీసు అధికారులు దృష్టి సారించాలని, సాంకేతిక, శక్తి బృందాలు, ఇతర ఆధారాలతో వారిని గుర్తించాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నాన్ బెయిల్‌బుల్ వారెంట్ల అమలు, హత్య కేసుల్లో పురోగతి సాధించాలన్నారు. ఇరువర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశమున్న కుటుంబ, ఆస్తి వివాదాలు, చిన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్, ఇతర కాంపౌండ్ కేసులను గుర్తించి లోక్ అదాలత్‌లో రాజీ అయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ ఆర్‌ఎం
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య డయల్ యువర్ ఆర్‌ఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీ్త్రశక్తి పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) అమలు తీరుపై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంపై మహిళల సూచనలు, సలహాలు, సమస్యలను 9959225603 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.
‘క్వాంటమ్’తో సమూల మార్పులు
ఎచ్చెర్ల : క్వాంటమ్ అధ్యయనాలే నేటి వైజ్ఞానిక రంగంలో సమూల మార్పులకు ఊతమిస్తున్నాయని డాక్టర్ బీఆర్‌ఏయూ వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ తెలిపారు. ఎచ్చెర్లలోని అంబేడ్కర్ వర్సిటీలో ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ అనే అంశంపై ఫిజిక్స్ విభాగం నిర్వహిస్తున్న మూడు రోజుల ప్రత్యేక ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్వాంటమ్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలు, అవకాశాలు ఏర్పడతాయన్నారు. నాగార్జున వర్శిటీ పూర్వ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.సంధ్య, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాడ్యుయేట్ స్టడీస్(బెంగుళూరు) ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.రామ్‌కుమార్‌లు మాట్లాడుతూ గణిత, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో పాటు పలు రంగాలకు క్వాంటమ్ కంప్యూటింగ్‌తో బహుళ ప్రయోజనాలు ఉంటాయన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే క్వాంటమ్ ఏఈ వంటివి వారి ప్రగతిలో కీలకంగా మారాయని చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, పూర్వ రిజిస్ట్రార్ పి.సుజాత, ప్రిన్సిపాల్స్ ఎస్.ఉదయభాస్కర్, సీహెచ్ రాజశేఖరరావు, ఫిజిక్స్ అధ్యాపకులు పి.శివప్రసాద్‌రెడ్డి, ఎం.సుబ్బారావు, ఎ.గణేష్ బాబు, సుష్మారెడ్డి పాల్గొన్నారు.
ఎరువుల కోసం ఆందోళన పడొద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. బుధవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించి పలువురు రైతుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

14న జిల్లా జూనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక