
ఇద్దరు సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్
● యూరియా వివరాలు సక్రమంగా
తెలియజేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం
కంచిలి: పంట సాగు విస్తీర్ణం నమోదులో రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు, సచివాలయ ఉద్యోగుల మధ్య సమన్వయలోపం తలెత్తడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచిలి మండలం గోకర్ణపురం రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులతో కలిసి గోకర్ణపురం, శాసనాం, వీరనారాయణపురం గ్రామాల్లో ఇంతవరకు సరఫరా చేసిన యూరియా, వాస్తవంగా అవసరమైన యూరియా వివరాలు తెలియజేయాలని రెండు శాఖల అధికారులను వేర్వేరుగా ప్రశ్నించారు. ఈ క్రమంలో వేర్వేరు నివేదికలు చెప్పిన వీఏఏ దిక్కల అన్వేష్, వీఆర్వో జి.వెంకటరమణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు. మండలస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంపై తహశీల్దార్ ఎన్.రమేష్‌కుమార్, మండల వ్యవసాయాధికారి కె.సురేష్‌లను మందలించారు. గోకర్ణపురం, శాసనాం సర్పంచ్‌లు యారడి ఆనందరావు, గుడ్డిపద్ర వేణులు స్థానిక రైతు ప్రతినిధులుగా వ్యవహరించి, ఇక్కడ ఏ మేరకు యూరియా అవసరం అనేది నివేదించడంతో.. త్వరలో 420 బస్తాల యూరియా పంపిస్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం గోకర్ణపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కె.అప్పలస్వామి, తహశీల్దార్ ఎన్.రమేష్‌కుమార్, వ్యవసాయ సహాయ సంచాలకులు టి.భవానీ శంకర్, ఎంపీడీఓ వి.తిరుమలరావు, మండల వ్యవసాయాధికారి కె.సురేష్, ఎంఈఓ ఎస్.శివరాంప్రసాద్, వీఆర్వోలు, వీఏఏలు పాల్గొన్నారు. కాగా, రైతులకు సక్రమంగా యూరియా అందకపోవడం వెనుక గల కారణాలను పక్కన పెట్టి అనవసరంగా ఉద్యోగులను సస్పెండ్ చేయడం ఏంటని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ సస్పెన్షన్‌లను నిలుపుదల చేయాలని రాజకీయ ఒత్తిళ్లు మొదలైనట్లు తెలుస్తోంది.