
స్మార్ట్‌దోపిడీ!
● స్మార్ట్ రేషన్‌కార్డులకు అథెంటికేషన్ పేరిట దందా
● కార్డుకు రూ.30 నుంచి రూ.50 వరకు వసూళ్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు లబ్ధి చేకూర్చే ఏ కార్యక్రమం చేపట్టినా అందులో ఏదో ఒక రూపంలో డబ్బు సంపాదించే మార్గాన్ని కొందరు టీడీపీ నాయకులు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులను ప్రభుత్వం ఇటీవల లబ్ధిదారులకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. కార్డులను సచివాలయాలు సిబ్బంది, రేషన్‌షాప్ డీలర్ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ సమయంలో కార్డు అథంటికేషన్ చేయించుకోవాలి. దీనికి మూడు రకాల విధానాలను ప్రభుత్వం సూచించింది. ఫేషియల్ యాప్, ఓటీపీ, బయోమెట్రిక్ విధానాల్లో ఏదో ఒక విధానంలో వెరిఫై తప్పనిసరి చేసింది. ఈ సమయంలో లబ్ధిదారుల నుంచి ఒక్కొక్క కార్డుకు రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ దందా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 6,57,758 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు 6,51,717 స్మార్ట్ కార్డులు విడుదల చేశారు. వీటి పంపిణీ గ్రామాల్లో ముమ్మరంగా జరుగుతుంది. అనేక చోట్ల డీలర్లు డబ్బులు తీసుకుంటున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో డీలర్లకు టీడీపీ నాయకులకు మధ్య విభేదాలు సైతం తలెత్తుతున్నట్లు తెలిసింది. మరికొన్ని చోట్ల స్మార్ట్ కార్డు వసూళ్లు వెనుక డీలర్లతోపాటు స్థానిక కూటమి నాయకులు ఉన్నట్లు సమాచారం.