
నేపాల్ సమాచారం కోసం హెల్ప్‌లైన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: నేపాల్‌లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర హెల్ప్‌లైన్‌ను కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ ఏర్పాటు చేశారు. 9491222122 నంబరుకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. దీనిని పర్యవేక్షించేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. పారిశ్రామిక ప్రోత్సాహక అధికారి కిరణ్ (9949478989), సీనియర్ సహాయకులు ఎల్.రాజ్యలక్ష్మి (9441022669), సహాయ జిల్లా సమాచార అధికారి బి.విజయ్‌బాబు (9110769608) బృందం హెల్ప్‌లైన్‌కు వచ్చే ప్రతి కాల్‌ను స్వీకరించి వివరాలు నమోదు చేసుకుంటుంది. సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌కు చేరవేసి సహాయ చర్యలు వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతుంది.
థర్మల్ ప్లాంట్ సర్వే అడ్డగింత
బూర్జ: ఆదివాసీల జీవితాలతో పాటు పర్యావరణాన్ని నాశనం చేసే క్రిటికల్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తమ ప్రాంతంలో చేపట్టవద్దంటూ ఆదివాసీలు నినాదాలు చేశారు. బుధవారం బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లోని జేవీ పురం, తిమడాం, జంగాలవలస, బొడ్లపాడు, వెన్నెలవలస గ్రామాల ఆదివాసీలు మూకుమ్మడిగా వచ్చి తిమడాం వద్ద సర్వే బృందాలను అడ్డుకున్నారు. సర్వే చేపట్టవద్దంటూ వారి వద్ద మెటీరియల్ తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆదివాసీలకు నచ్చజెప్పి మెటీరియల్‌ను తీసుకుని సిబ్బందికి అందజేశారు. ఈసందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ ప్రాణత్యాగం చేసైనా ప్లాంట్ నిర్మాణం అడ్డుకుంటామని స్పష్టం చేశారు.