
చేయి తడిపితేనే పనులు..
జిల్లా వైద్యారోగ్య శాఖలో ఇటీవల జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా పనిచేసిన బాలమురళీకృష్ణ నేరుగా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి విదితమే. ఈ ఘటన తర్వాత డీఎంహెచ్‌వో కార్యాలయంలో అంతా సవ్యంగా ఉంటుందని భావించినప్పటికీ.. మళ్లీ యథావిధిగా లంచాల జోరు పెరిగింది. తాజాగా జరిగిన ఏఎన్‌ఎంల బదిలీల్లో రూ.లక్షల్లో చేతులు మారిన సంగతి విదితమే. తాజాగా వర్గ పోరులతో సామాన్య ఉద్యోగుల సమస్యలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. సర్వీస్ రెగ్యులైజేషన్, సరెండర్ లీవులు, మెడికల్ లీవులు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్, ఛైల్డ్ కేర్ లీవులు, మూమెంట్ ఆర్డర్లు తదితర పనుల నిమిత్తం ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచి నిత్యం ఉద్యోగులు తమ వినతులను ఇస్తుంటారు. నెలలు గడుస్తున్నా ఫైళ్లకు మోక్షం కలగడం లేదని వాపోతున్నారు. ప్రతి పనికి రూ.5 వేల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఓ రెగ్యులైజేషన్ పెండింగ్ ఉన్న ఓ ఉద్యోగి ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది సరెండర్ లీవుల పేరిట వస్తున్నప్పటికీ ఫైళ్లకు స్థానచలనం లేకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారనే విమర్శలున్నాయి. చేతికి లంచం ఇస్తే.. వెంటనే పనులు అవుతున్నాయని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు ఈ శాఖ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.