
సహజ వనరుల దోపిడీకే ఆపరేషన్ కగార్
పలాస: దేశంలో సహజ వనరుల దోపిడీకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి పి.ప్రసాద్ అన్నారు. మండలంలోని లొత్తూరులో సిక్కోలు పోరాట యోధులు కుమారన్న, సీతారాముల వర్ధంతి సభను బుధవారం నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రప్రకాష్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో పర్యావరణాన్ని రక్షిస్తూ అడవులను కాపాడుతున్న ఆదివాసీలను ఆపరేషన్ కగార్ పేరుతో అంతమొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఈ దుర్మార్గమైన చర్యని ప్రజలు ఖండించాలని కోరారు. అడవులను, ఆదివాసీలను కాపాడటానికే కుమారన్న, సీతారాములు తుపాకులు పట్టారని, వారిని కూడా ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ప్రజా ఉద్యమాలను అణిచి పెట్టడానికి పూనుకుంటోందని, కనీసం రైతులకు ఎరువులు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉండడం విచారకరమని మండిపడ్డారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి వంకల మాధవరావు, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, సవలాపురం కృష్ణవేణి, గొరకల బాలకృష్ణ, మామిడి భీమారావు, జుత్తు వీరాస్వామి, పోతనపల్లి కుసుమ, బదకల ఈశ్వరమ్మ, ఎం.వినోద్, సొర్ర రామారావు, సార జగన్, సవర బంగ్లాకుమార్, సీమాన్ తదితరులు పాల్గొన్నారు.