
ప్రభుత్వ బడులను విస్మరిస్తున్నారు
● మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వజం
● మురికింటిభద్ర పాఠశాల పరిశీలన
మెళియాపుట్టి: కూటమి ప్రభుత్వం ప్రభుత్వ బడులను విస్మరిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. మండలంలోని మర్రిపాడు.కె పంచాయతీ పరిధి మురికింటిభద్ర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పాఠశాల భవనం స్లాబ్ ఊడిపడి, తరగతి గదిలోకి వర్షపు నీరు చేరింది. దీంతో అక్కడి పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాల పరిస్థితి చూస్తుంటే విద్యకు కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత తెలుస్తోందని ఎద్దేవా చేశారు. వర్షం పడితే విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేశామని, కూటమి ప్రభుత్వం పాఠశాలలు, విద్యార్థులపై అవలంభిస్తున్న విధానాలు మార్చుకోవాలని సూచించారు. పాఠశాలలో ఇంత సమస్య ఉన్నా అధికారులు సైతం నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తుండడం బాధాకరమన్నారు. విద్యార్థులతో ముచ్చటించి, వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలోని వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆదినాయుడు, మండల కన్వీనర్ పోలాకి జయమునిరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు బమ్మిడి ఖగేశ్వరరావు, ఉర్లాన బాలరాజు, అలికాన మాధవరావు, పైల హరి, పల్లి యోగి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.