
కలెక్టరేట్ వద్ద డ్రైవర్ల ధర్నా నేడు
రణస్థలం: ఉచిత బస్సు పథకం వలన ఉపాధి కోల్పోతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 వేలు చెల్లించాలని కోరుతూ, గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు రణస్థలం, కోష్ట, పైడిభీమవరంలో ఆటో డ్రైవర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ధర్నా కరపత్రాలు ఆవిష్కరించి ప్రచారం నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్‌ఐలతో కూడిన సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
గొర్రెల కాపరిని ఆదుకోవాలి
రణస్థలం: మండలంలోని జేఆర్‌పురం పంచాయతీ సీతంవలసకు చెందిన గొర్రెల కాపరి పిట్ట రమణకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లించాలని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నాయకుడు కోనంగి నందుడు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు మద్దాడ రాజశేఖర్‌లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తహసీల్దార్ సనపల కిరణ్‌కుమార్, పశు సంవర్ధక శాఖ జేడీ కె.రాజగోపాల్‌రావు, ఏడీఏ బి.దుర్గారావులకు బుధవారం వినతిపత్రాలు అందజేశారు. ఇటీవల పైడిభీమవరం సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని రమణకు చెందిన 20 గొర్రెలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన సుమారు రూ.5 లక్షల నష్టం వాటిళ్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని విన్నవించుకున్నారు.

కలెక్టరేట్ వద్ద డ్రైవర్ల ధర్నా నేడు