
పచ్చని ఉద్దానంలో విధ్వంసం తగదు
వజ్రపుకొత్తూరు రూరల్/మందస : పచ్చని చెట్లతో కోనసీమను తలపిస్తూ జిల్లాకు వరంగా ఉన్న ఉద్దాన ప్రాంతాన్ని కార్గో ఎయిర్ పోర్టు పేరుతో విధ్వంసం చేయడం తగదని వామపక్ష నాయకులు అన్నారు. జీడి, కొబ్బరిపంటలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఉద్దాన రైతులను నిరాశ్రయులను చేయడం ఎంత వరకు సమంజసమో చెప్పాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడును ప్రశ్నించారు. ఉద్దాన ప్రాంత బాధిత గ్రామాల్లో శనివారం రైతులతో కలిసి కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా వామపక్షాల నాయకులు చైతన్య ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షులు కొమర వాసు, జోగి అప్పారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి భూములను నమ్ముకున్న జీవనోపాధి సాగిస్తున్న ప్రజలను అభివృద్ది పేరుతో పొట్ట కొట్టడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కొంత కాలంగా గ్రామస్తులు ఉద్యమాలు చేస్తున్నా కనీసం పట్టించుకోకుండా సర్వేలు చేపట్టడం దారుణమని మండిపడ్డారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం లాంటి నగరాలకు అనుసంధానంగా కార్గో ఎయిర్ పోర్టులు ఉన్నాయని, దేశంలో ఎక్కడా ప్రత్యేక కార్గో ఎయిర్ పోర్టు లేదని గుర్తు చేశారు. పచ్చని ఉద్దానాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం మానుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్గో ఎయిర్ పోర్టు పోరాట కమిటీ నాయకులు కోనారి మోహన్‌రావు, బత్తిని లక్ష్మణ్, పోతనపల్లి కుసుమ, ఎన్.గణపతి, తెప్పల అజయ్‌కుమార్, పత్రి దానేష్, డి.హరికృష్ణ, కె.రమేష్, జోగి కోదండరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.