
క్షోభంలో క్షేమం..!
● ఏడాదిగా వసతి గృహాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
● అరకొర వసతులతో కాలం వెళ్లదీత
● తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
● పట్టించుకోని అధికారులు
సంక్షేమ వసతి గృహాధికారులు ఎక్కడా అందుబాటులో నివాసం ఉండే పరిస్థితి లేదు. ఒకొక్క వార్డెన్‌కి రెండు, మూడు వసతి గృహాల ఇన్‌చార్జిల బాధ్యతలు ఉంటున్నాయి. ఇవి కూడా కనీసం 30 కిలోమీటర్ల దూరంలో ఇస్తున్నారు. సాధారణంగా ఇన్‌చార్జిగా దగ్గరలో ఉన్న వసతి వార్డెన్‌కు బాధ్యతలు ఇవ్వాల్సి ఉన్నా, ప్రస్తుతం బీసీ సంక్షేమంలో ఇందుకు భిన్నంగా ఉంది. దూరప్రాంతాల్లో ఉన్నవారికి బాధ్యతలు ఇస్తున్నారు. దీంతో వసతి గృహ నిర్వహణ కిందిస్థాయి సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై విడిచి పెడుతున్నారు. మరోవైపు ఏడాదిగా వసతి గృహాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. అధికారులు కార్యాలయానికే పరిమితం కావడం, వ్యక్తిగత లాభాపేక్ష చూసుకుంటుండడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. అలాగే వైఎస్సార్‌సీపీ హయాంలో వసతి గృహాల ఆధునికీకరణ పనులు చేపట్టి ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు కృషి చేయగా, నేడు భవనాలకు పడుతున్న బూజును కూడా శుభ్రం చేయడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని వసతి గృహాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఏడాదిగా సంక్షేమ శాఖ వసతి గృహాలు, అక్కడ చదువుతున్న విద్యార్థులను పట్టించుకోవడం లేదు. దీంతో సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. జిల్లాలో బీసీ వసతి గృహాలు ప్రీ మెట్రిక్ స్థాయిలో 63 ఉన్నాయి. వీటిలో వసతులు లేవు. కొన్ని అద్దె భవనాల్లో ఉండగా, వాటి పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఇక ఎస్సీ వసతి గృహాలు ప్రీ మెట్రిక్‌లో సుమారుగా అన్ని ప్రభుత్వ భవనాలే అయినప్పటికీ, అక్కడ కూడా అరకొర వసతులతోనే కాలం గడుపుతున్నారు.
మెనూ అమలు ఎక్కడ..?
సంక్షేమ వసతి గృహ అధికారులు విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన మెనూ అమలు చేయడం లేదు. దీనిపై కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తే వారికి అడ్డగోలు సమాధానాలు చెబుతున్నారు. ప్రభుత్వం నిధులు సకాలంలో మంజూరు చేయడం లేదని చెప్పడం, లేకుంటే ఎదుదాడికి దిగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మెనూ అమలులో ఉంది. ప్రతి ఏటా మారుతున్న మెనూ అమలు చేయాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు ఇటీవల పురుగులు పట్టిన బియ్యం అందజేస్తుండడంతో వసతి గృహం పేరు చెబితేనే విద్యార్థులు భయపడుతున్నారు.
క్షోభంలో క్షేమం..!
కొరవడిన పర్యవేక్షణ
శ్రీకాకుళం బాలుర ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థులకు భోజనం పెడుతున్న దృశ్యం (ఫైల్)
తగ్గుతున్న విద్యార్థులు
బీసీ, ఎస్సీ వసతి గృహల్లో విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది ఘననీయంగా తగ్గింది. వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెట్రిక్ పరిధిలో జిల్లాలో 53 బాలురు, 10 బాలికల బీసీ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 2024–25 విద్యా సంవత్సరంలో బాలురు 4,019 మంది, బాలికలు 1,070 మంది కలిపి మొత్తం 5,086 మంది ఉండేవారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరంలో బాలురు 3,269 మంది, బాలికలు 894 మంది కలిపి మొత్తం 4,163 మంది ఉన్నారు. అంటే ఒక ఏడాది కాలంలో 923 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదేవిధంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 17 బాలురు, 14 బాలికల ఎస్సీ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 2024–25 విద్యా సంవత్సరంలో బాలురు 1,352 మంది, బాలికలు1,438 మంది కలిపి మొత్తం 2,790 మంది విద్యార్థులు ఉండేవారు. కాగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో బాలురు 1,122 మంది, బాలికలు 1,110 మంది కలిపి మొత్తం 2,232 మంది ఉన్నారు. అంటే ఒక ఏడాది కాలంలో 558 మంది తగ్గారు.