
‘కనీస వేతనం రూ. 26 వేలు అందించాలి’
ఆమదాలవలస: ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి కనీస వేతనం రూ.26 వేలు అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ మున్సిపల్ వర్కర్స్–ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు తాడి సంతోష్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెలో భా గంగా, పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమంలో నిరసన తెలిపి నినాదాలు చేశా రు. మున్సిపల్ కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆప్కాస్ సంస్థను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడాన్ని నిలిపివేయాలని కోరారు. తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు కాంట్రాక్ట్ కార్మికులకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. ధర్నాలో ఏపీ మున్సిపల్ వర్కర్స్–ఎంప్లాయీస్ ఫెడరేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి నీలాపు రాజేష్, నాయకులు జె.శ్రీనివాసరావు, కె.తారకేశ్వరరావు, కె. ధనలక్ష్మి, ఎన్.రమ, కె.ఈశ్వరరావు, కె.నీలమ్మ పాల్గొన్నారు.