
వినతులు విన్నారా..?
శ్రీకాకుళం పాతబస్టాండ్:
భూ వినతులు బుట్ట దాఖలవుతున్నాయా..? అర్జీలు ఉన్నతాధికారుల వరకు చేరడం లేదా..? విన్నపాలు విని ఊరుకుంటున్నారా..? జిల్లాలో పరిస్థితి చూస్తే ఔననే సమాధానం వినిపిస్తోంది. రైతులు ప్రతి నిత్యం భూ సమస్యలతో సతమతమవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రభుత్వం అందించే ప్రయోజనాలకు దూరమవుతున్నారు. ఉన్నతాధికారులు ప్రతి నెల డివిజన్‌ల వారీగా ఆర్‌ఓఆర్ సమావేశాలు నిర్వహించి, ఆదేశాలు, ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం మార్పు కనిపించడం లేదు.
ఆ రెండు సమస్యలే ప్రధానం..
రైతులను ప్రధానంగా రెండు సమస్యలు వేధిస్తున్నా యి. ఇందులో ఒకటి జాయింట్ ఎల్‌పీఎం(ల్యాండ్ పార్సిల్ మ్యాప్), మరొకటి 22ఎ జాబితాల్లో జిరాయితీ భూమి నమోదు. ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ ఫిర్యాదుల్లో సగం వరకు ఈ తరహా వినతులే వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు సదస్సులు, ప్రజా దర్బార్లు నిర్వహించినా వీరి సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు.
అన్నీ పెండింగే..
జిల్లాలో 735 రెవెన్యూ గ్రామాల్లో పెండింగ్‌లో 12,245 జాయింట్ ఎల్‌పీఎంలు ఉన్నాయి. వీటిని పరిష్కారానికి జూన్ 30 వరకు గడువు ఇచ్చారు. కేవలం రూ.50 తీసుకుని ఈ ఎల్‌పీఎంల సమస్య లు పరిష్కరించాలని అధికారులు గడువు పెట్టారు. ఈ కాలంలో కనీసం పదో వాటా కూడా సమస్యలను పరిష్కరించలేదు. ప్రస్తుతం రైతులు ఎల్‌పీఎంలను మార్చుకోవాలంటే రూ.550లు చెల్లించి చలా నా తీయాలి. దీంతో సర్వేయర్ మళ్లీ పొలం వద్దకు వస్తారు. ఆయనతో పాటు వీఆర్‌ఓ, అవసరాన్ని బట్టి మండల సర్వేయర్ కూడా పొలాన్ని సందర్శించాక ఈ ఎల్‌పీఎం విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఈ పనులు జరగాలంటే కనీసం ఆ భూమి ఉన్న ప్రదేశం, విలువ, ఎల్‌పీఎం నంబర్లు బట్టి సర్వేయర్‌కు రూ.వెయ్యి నుంచి రూ.5వేలు వరకు ముట్టజెప్పాల్సి వస్తోంది. జిల్లా, డివిజన్ కేంద్రాల్లో ఈ ధర రెట్టింపు ఉంటుంది. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ లో 308 గ్రామాల్లో 7358 జాయింట్ ఎల్‌పీఎంలు, టెక్కలి రెవెన్యూ డివిజన్‌లో 213 గ్రామాల్లో 2686, పలాస రెవెన్యూ డివిజన్‌లో 214 గ్రామాల్లో 2201 పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో 735 గ్రామాల్లో రీ సర్వే చేశారు. ఈ క్రమంలో గ్రామ స్థాయిలో సర్వే యర్లు ఫీల్డ్ వర్క్‌ను విస్మరించి, టేబుల్ వర్క్‌లు చేయడంలో రైతుల వివరాలు తప్పుగా నమోదయ్యాయి. దీంతో రైతుకు అవస్థ తప్పడం లేదు.
గడువు ముగిసినా పరిష్కారం కాని రైతుల సమస్యలు
సర్వేయర్లు, వీఆర్‌ఓలకు కాసుల పంట
22ఎలకు ఇదే పరిస్థితి
ఆన్‌లైన్‌లో పేరుకుపోతున్న అర్జీలు
రోజూ 22ఎ సమస్యలే..
జిల్లా వ్యాప్తంగా 22ఎ సమస్యలు రైతులను వేధిస్తు న్నాయి. వారసత్వంగా వస్తున్న జిరాయితీ భూము ల ‘పహణీ’ మార్పులు జూన్‌లో జరుగుతాయి. ఈ సమయంలో వీఆర్‌ఓలు వీటిలో చాలావరకు జిరా యితీ భూములను 22ఎలకి మార్పు చేస్తున్నారు. 22ఎ జాబితా నుంచి మళ్లీ జిరాయితీగా మార్చాలంటే జాయింట్ కలెక్టర్ ఆనుమతి ఉండాలి. ఈ ప్రక్రి య సర్వేయర్, వీఆర్‌ఓతో ప్రారంభమై మండల సర్వేయర్, తహసీల్దారు, ఆర్డీఓ కార్యాలయం, కలెక్టరేట్ ఈ సెక్షన్, తర్వాత జాయింట్ కలెక్టర్ వరకు చేరాలి. దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్ ఈ సెక్షన్‌లో 22ఎ కి సంబంధించి దరఖాస్తులు 34 ఉన్నాయి. వీటిలో సోంపేట, మందస, నందిగాం, పలాస, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి.
జిరాయితీని 22ఎలో పెట్టేశారు
మాకు వారసత్వంగా తాతల నుంచి వచ్చిన జిరాయితీ భూమిని 22ఎ లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. కావాలనే వీఆర్‌ఓ ఇతర రెవెన్యూ అధికారులు మాకు సమస్యలను సృష్టిస్తున్నారు. సరి చేయాలని దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదు. వారి తప్పు వల్ల నేను పని మానుకుని శిక్ష అనుభవిస్తున్నాను.
– అన్నెపు శ్రీనివాసరావు, చింతాడ

వినతులు విన్నారా..?