
కంచిలిలో భారీ చోరీ
కంచిలి:
మండల కేంద్రం కంచిలిలో భారీ చోరీ జరిగింది. మెయిన్‌రోడ్డులో నివాసముంటున్న విశ్రాంత లెక్చరర్ సింహాద్రి ప్రధాన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. బీరువాలో భద్రపరిచిన 24.5 తులాల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితుడు చెప్పిన వివరాల మేరకు.. తమ పెద్ద కుమారుడు జర్మనీ నుంచి ఇండియాకు వచ్చి, విశాఖపట్నంలో తమ వియ్యంకుడు ఇంట్లో ఉండడంతో వారిని కలవడానికి శనివారం ఉదయం భార్యతో కలిసి వెళ్లారు. తిరిగి ఆదివారం సాయంత్రం కంచిలిలో తన నివాసానికి చేరుకున్నారు. వారు ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్‌తో పాటు ముందున్న గ్రిల్ తెరిచి ఉన్నాయి. ఇనుప గ్రిల్ డోర్‌కు తాళం వేసి ఉన్న భాగాన్ని కట్‌చేసి, మెయిన్‌డోర్ లాక్‌ను తెరిచి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన 24.5 తులాల బంగారు ఆభరణాలను, ఒక కిలో వెండి ఆభరణాలను దొంగిలించినట్లు తెలుసుకొని షాక్‌కు గురయ్యారు. అమెరికాలో చదువుకుంటున్న చిన్న కుమారుడు విదేశీ చదువు కోసం చేసిన బ్యాంకు రుణాన్ని తీర్చడానికి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను సిద్ధం చేసి ఒక చోట భద్రపర్చగా, అవి చోరీకి గురైనట్లు వాపోయాడు.
ఆలస్యంగా ఫిర్యాదు
అయితే ఆదివారం సాయంత్రం విశాఖపట్నం నుంచి కంచిలి వచ్చిన వీరు తమ ఇంట్లో జరిగిన చోరీపై నిర్ఘాంతపోయారు. ఏం చేయాలో తెలియక పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. చివరికి కంచిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎస్‌ఐ పి.పారినాయుడు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ కేసును సోంపేట సీఐ బి.మంగరాజు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు పరిశీలించారు. సంఘటన స్థలంలో గుర్తులు, ఆధారాలను సేకరించడానికి శ్రీకాకుళం నుంచి క్లూస్ టీమ్ వచ్చింది.
24.5 తులాల బంగారు ఆభరణాలు,
ఒక కిలో వెండి మాయం
ఇంట్లో ఎవరూ లేని సమయంలో
దొంగతనం
ఆలస్యంగా వెలుగులోకి ఘటన

కంచిలిలో భారీ చోరీ

కంచిలిలో భారీ చోరీ