మున్సిపల్ కార్మికులకు పథకాలు వర్తింపజేయాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మున్సిపల్ కార్మికులందరికి (ఇంజనీరింగ్, పారిశుధ్య) తల్లికి వందనంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(సీఐటీయూ) నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం నగర కమిషనర్ పి.వి.వి.డి ప్రసాదరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆప్కాస్ ఉద్యోగి అనే పదాన్ని తొలగించి మున్సిపల్ కార్మికులందరికీ తల్లికి వందనంతో పాటు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కోరారు. అప్పట్లో 17 రోజుల సమ్మె సందర్భంగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు స్పందిస్తూ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలన్నీ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని కార్మికులు, ప్రజలు ఆశించారని, అందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సూరయ్య, టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, నగర అధ్యక్షులు ఎ.గణేష్, కమిటీ సభ్యులు ఎ.గురుస్వామి, ఆర్జి.శేఖర్, ఎ.జనా తదితరులు పాల్గొన్నారు.


