జీడి కార్మికుల పొట్టకొట్టొద్దు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రెండు వారాలుగా మూతబడిన జీడి పరిశ్రమలు వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాష్యూ లేబర్, రైస్ మిల్లర్స్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో పలాస కాష్యూ అసోసియేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి మాట్లాడుతూ రెండు వారాలుగా కార్మికులకు ఉపాధి లేక రుణాలు, డ్వాక్రా వాయిదాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కలాశీలు, పిక్కలు ఒలిచేవారు, బాయిలింగ్ తదితర కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కష్టంతో పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ప్రభుత్వ రాయితీలు పొంది నేడు కార్మికులకు ఆకలితో ఉంచడం సమంజసం కాదన్నారు. పరిశ్రమలు తెరవకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో సంఘ కార్యదర్శి సానా ఈశ్వరరావు, కోశాధికారి కోనారి రాము, బొంపల్లి సింహాచలం, కోనారి భీమారావు, జోగి మోహనరావు పాల్గొన్నారు.
విచారణలో గోప్యమెందుకో?
ఆమదాలవలస: రామచంద్రపురం పంచాయతీ పొన్నాంపేటలో ఉపాధి హామీ పనుల నిర్వహణ, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం అధికారులు విచారణ చేపట్టారు. ముందుగా రామాలయం బయట బహిరంగంగా విచారణ నిర్వహించగా ఫీల్డ్ అసిస్టెంట్‌పై వేతనదారులు ఫిర్యాదులు గుప్పించారు. దీంతో పూర్తి అక్రమాలు బయటపడతాయనో.. మరో కారణమో తెలియదు గానీ ఏపీడీ లోకేష్, ఇతర అధికారులు రామాలయం లోపలికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ లోపలికి వెళ్లగా సదరు అధికారి కేకలు వేస్తూ బయటకు వెళ్లిపోవాలని చెప్పడం చర్చనీయాంశమైంది. కాగా, గ్రామానికి చెందిన జి.ఎర్రంనాయుడు, హేమలత దంపతులకు రెండు జాబుకార్డులు ఉండటం, అదే గ్రామానికి చెందిన జి.రామారావు కో ఆపరేటివ్ ఉద్యోగిగా పనిచేస్తున్నా అతనికి భార్య ఎర్రమ్మ పేరిట మస్తర్లు వేయడం తదితర అంశాలపై గ్రామానికి చెందిన ఇప్పిలి రామచంద్రరావు, మరికొందరు ఇటీవల కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఫీల్డ్ అసిస్టెంట్ సరస్వతి మాట్లాడుతూ తనకు ఆరోగ్యం సరిగా లేని కారణంగా కొన్ని రోజులపాటు ఎర్రంనాయుడుతో మస్తర్లు వేయించానని, ఆ సమయంలో తప్పులు జరిగి ఉండవచ్చని చెప్పారు. సామాజిక ఆడిట్ సమయంలో ఆ మొత్తాలను చెల్లిస్తానని అంగీకరించారు. ఈ విషయమై ఏపీడీ మాట్లాడుతూ ఒక కుటుంబంలో రెండు జాబు కార్డులు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎం లక్ష్మీనరసమ్మ, ఈసీ రాము, టెక్నికల్ అసిస్టెంట్ నరేష్ పాల్గొన్నారు.
‘కూర్మ’ ఘటన దర్యాప్తు వేగవంతానికి కృషి
హిరమండలం: కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదానికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసేందుకు కృషిచేస్తానని సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ అన్నారు. సోమవారం కూర్మ గ్రామాన్ని సందర్శించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.పర్ణశాల పునఃనిర్మాణానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో గేదల చైతన్య తదితరులు పాల్గొన్నారు.
జీడి కార్మికుల పొట్టకొట్టొద్దు


