మండుటెండలో రెండు గంటలు..
శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాల, ఆస్పత్రిలోని సెక్యూరిటీ, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఏజెన్సీ ప్రతినిధులను మండుటెండలో రెండు గంటల పాటు నిలబెట్టి సమావేశం నిర్వహించడం వివాదానికి తావిచ్చింది. వారం రోజుల కిందట కొత్త ఏజెన్సీకి ఔట్‌సోర్సింగ్, సెక్యూరిటీ గార్డుల నిర్వహణ బాధ్య త అప్పగించారు. ఈ ఏజెన్సీ ప్రతినిధులు బుధవారం మండుటెండలో సిబ్బందినందరినీ నిలబెట్టి సుమారు రెండు గంటల పాటు సమావేశం నిర్వహించి వీళ్లందరిలో క్రమశిక్షణ లేదని, వైద్యులు ఇతర ఉద్యోగులకు నమస్కరించడం లేదని, సమయపాలన పాటించడం లేదని చెప్పారు. దీంతో సెక్యూరిటీ గార్డులంతా తమ ఎంఓయూలో రూ.18వేలు జీతాన్ని నమోదు చేశారని, గత ఏజెన్సీ రూ.పది వేలు మాత్రమే చెల్లిస్తూ వచ్చిందని, ప్రస్తుతం మీరెంతో చెల్లిస్తారో చెప్పాలని పట్టుబట్టారు. ఇలా మాటకు మాట పెరిగింది. అయితే ఏజెన్సీ ప్రతినిధులు ముగ్గురిపై రెండో పట్టణ పోలీసులుకు ఫిర్యాదు చేయడం తీవ్ర దుమారాన్ని లేపింది. గురువారం ఉదయం పోలీసులు నుంచి ఆ ముగ్గురిని స్టేషను వద్దకు రావాలని కబురురావడంతో సెక్యూరిటీ గార్డులంతా విధులకు హాజరుకాకుండా కాసేపు నిరసన తెలిపారు. అనంతరం విధులకు హాజరయ్యారు. కొందరు నాయకులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు.


