టెక్కలి రవీంద్రభారతి పాఠశాలకు తాళాలు
టెక్కలి: టెక్కలిలో రవీంద్రభారతి పాఠశాలకు శనివారం మండల విద్యా శాఖాధికారి దల్లి తులసీరెడ్డి తాళాలు వేశారు. విద్యాశాఖ నుంచి ఎటువంటి గుర్తింపు అనుమతులు లేకపోవడంపై పలుమార్లు హెచ్చరించినా సంబంధిత యాజమాన్యం స్పందించకపోవడంతో పాఠశాలను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌కేజీ నుంచి 7వ తరగతికి సంబంధించి విద్యా శాఖ నుంచి ఏటా అనుమతులు తీసుకోకుండా తాత్సారం చేశారని, దీనిపై పలుమార్లు హెచ్చరించినా స్పందించకపోవడంతో జిల్లా అధికారుల ఆదేశాలతో పాఠశాలను మూసివేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల బదిలీ సర్టిఫికెట్లు(టీసీ)లను తమ కార్యాలయం ద్వారా అందజేస్తామని తెలిపారు. కాగా, పాఠశాల మూసివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
చెరువులో ఆక్రమణలు అడ్డగింత
నరసన్నపేట: స్థానిక నరసన్న చెరువును శ్రీరామనగర్ సమీపంలో కొందరు వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడగా రెవెన్యూ సిబ్బంది స్పందించి అడ్డుకున్నారు. మాజీ సైనికులకు 1991లో చెరువు గర్భంలో పట్టా ఇచ్చారంటూ కొందరు శనివారం చెరువు భాగంలో ఉన్న జంగిల్‌ను జేసీబీతో శుభ్రం చేయించారు. స్థానికులు స్పందించి తహసీల్దార్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి ఆర్‌ఐ సాయిరాంకు తగు సూచనలు చేశారు. ఈ మేరకు వీఆర్వో చెరువు వద్దకు వెళ్లి పనులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు.
ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
పోలాకి : రాజపురం వద్ద మట్టి ట్రాక్టర్ ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. కోలకతాకు చెందిన నౌగాన ఆదిలక్ష్మి(54) బెలమర గ్రామంలో ఉన్న తన కుమార్తె ఇంటికి వచ్చింది. శనివారం సాయంత్రం గుల్లవానిపేట బీచ్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి తిరిగి వస్తుండగా.. అటుగా మట్టి తీసుకొస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలాకి ఎస్‌ఐ రంజిత్ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలిపారు.
టెక్కలి రవీంద్రభారతి పాఠశాలకు తాళాలు


