నవోదయం పిలుస్తోంది..!
శ్రీకాకుళం న్యూకాలనీ:
జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో ప్రవేశాలకు పిలుపొచ్చింది. వచ్చే 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. గ్రామీణ విద్యార్థులకు మంచి ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించడంతో పాటు జాతీయ భావం, జాతీయ సమైక్యతకు కృషి చేయాలనే ఆశయాలతో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఇక్కడ 6 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విద్యతో పాటు హాస్టల్ వసతి సౌకర్యంను కల్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సరుబుజ్జిలి మండల పరిధిలోని వెన్నెలవలసలో జవహర్ నవోదయ విద్యాలయం ఉంది. ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నవోదయలో సీటు రావాలని కలలు కంటారు. 100 మార్కులకు దాదాపు 90 మార్కులపైబడి సాధిస్తేనే సీటు దొరికే అవకాశం ఉంటుంది. తాజాగా నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నవోదయ విద్యాలయం ప్రవేశాని కి సంబంధించి దరఖాస్తు విధానం, అర్హతలు, పరీక్ష విధానం, అక్కడ లభిస్తున్న సదుపాయాలు వసతు లు తదితర అంశాలను ఒకసారి పరిశీలిద్దాం...
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు..
2026–27 ఏడాదికి సంబంధించి ప్రవేశ పరీక్ష నిర్వహణకు అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. https://cbseitms.rcil. gov.in/ nvs/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్న దరఖాస్తులను మాత్రమే నవోదయ విద్యాలయ సమితి అనుమతిస్తారు. దీనికి ఆఫ్‌లైన్ విధానమనేది లేదు. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చేనెల జూలై 29వ తేదీ వరకు గడువు విధించారు. డిసెంబర్ 13వ తేదీన జేఎన్‌వీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రాతిపదికగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
5వ తరగతి చదువుతున్నవారు అర్హులు
జేఎన్‌వీల్లో 6వ తరగతిలో 80 సీట్లు ఉండగా, 75 సీట్లు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి కేటాయిస్తారు. ఐదు సీట్లు పట్టణ ప్రాంతాల విద్యార్థులకు నిర్దేశించారు. జిల్లా జనాభా ప్రాతిపదికన ఎస్టీలకు 15 శాతం, ఎస్సీలకు 7.5 శాతం, బాలికలకు 1/3 శాతం, విభిన్నప్రతిభావంతుల(దివ్యాంగులు)కు 3 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వరుసగా 3, 4 తరగతి చదివి.. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న బాలబాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే విద్యార్థులు 2021–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చదువుతూ 2014 మే ఒకటి నుంచి 2016 జూలై 31వ తేదీ మధ్యలో జన్మించి ఉండాలి.
వసతులు, సౌకర్యాల కల్పన భేష్
శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం వెన్నెలవసలలోని జవహర్ నవోదయ విద్యాలయంలో అన్ని వసతులు, సౌకర్యాలు మెండుగా ఉన్నాయి. ఉత్తమ బోధన అందిస్తున్నారు. విద్యాలయంలో తరగతులకు అకడమిక్ బ్లాక్, పాలనా సౌలభ్యానికి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, బాలబాలికలకు వేర్వేరుగా డార్మెటరీలు, భోజనశాలలు, బోధకులు, సిబ్బందికి ప్రత్యేక క్వార్టర్స్‌ను నిర్మించారు. విద్యాలయం ఆవరణలో క్రీడల కోసం ప్రత్యేకంగా మైదానాన్ని తీర్చిదిద్దారు. ఆటపాటలు, యోగా వంటివి నిర్వహిస్తుంటారు. విద్యార్థుల కోసం వ్యాయామశాలలు ఉన్నాయి. స్మార్ట్ తరగతుల కొనసాగిస్తున్నారు. సైన్సు, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయం వంటి సౌకర్యాలు ఉన్నాయి.
6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్
ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం
జూలై 29 వరకు దరఖాస్తులకు గడువు
డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష
ప్రణాళికతో చదివితే సీటు
6వ తరగతిలో 80 సీట్లను నింపుతారు. ఇందుకు ప్రవేశపరీక్ష నిర్వహించి మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. కేంద్ర జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి 1986లో జవహర్ నవోదయ విద్యాలయాలు స్థాపించింది. 6వ తరగతి మొదలుకుని 12వ తరగతి వరకు తరగతులు కొనసాగిస్తారు. ఏడు ప్రాంతీయ భాషల్లో, మాతృభాషల్లో బోధన జరుగుతుంది. పదో తరగతి వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)ను అమలు చేస్తారు. సమయం కేటాయించి ప్రణాళికబద్ధంగా చదివితే సీటు సాధించవచ్చని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. మొత్తం 80 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో మెంటల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు–50 మార్కులు, అర్థమెటిక్ నుంచి 20 ప్రశ్నలు– 25 మార్కులు, లాంగ్వేజ్ నుంచి 20 ప్రశ్నలు–25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతోనే పరీక్ష జరుగుతుంది. మాథ్స్, సైన్స్, ఇంగ్లిషు సబ్జెక్టులపై 5వ తరగతి వరకు పాఠాలపై పూర్తిగా అవగాహన పెంచుకుని, పూర్వపు జేఎన్‌వీ పరీక్ష పేపర్లను, పాత మోడల్ పేపర్లను పూర్తిగా సన్నద్ధం చేయగలిగితే మంచి మార్కుల సాధనకు అవకాశం ఉంటుందని నిష్ణాతులు చెబుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రతిభ ఉన్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు జేఎన్‌వీలు వరమనే చెప్పాలి. గొప్ప అవకాశంగా భావించి, సద్వినియోగం చేసుకోవాలి. జూలై 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. తల్లిదండ్రుల కృషి, విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదువుకున్నట్లయితే మంచి స్కోర్‌కు ఛాన్స్ ఉంది. సీటు పొందవచ్చు. – దాసరి పరశురామయ్య, ప్రిన్సిపాల్,
నవోదయ విద్యాలయం, వెన్నెలవలస, సరుబుజ్జిలి
నవోదయం పిలుస్తోంది..!
నవోదయం పిలుస్తోంది..!
నవోదయం పిలుస్తోంది..!
నవోదయం పిలుస్తోంది..!


