
ఎక్కడి పనులు అక్కడే ఆపండి..
● ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ అక్రమ నిర్మాణం ● పరిశీలించిన అధికారులు
నరసన్నపేట: స్థానిక శివనగర్ కాలనీలో జోగి చెరువు గర్భాన్ని ఆక్రమించి స్థానిక ఎమ్మెల్యే ప్రైవే టు పీఏ రావాడ గణపతి చేపట్టిన అక్రమ నిర్మాణ పనులను అధికారులు గురువారం పరిశీలించి అడ్డుకున్నారు. జోగి చెరువు గర్భాన్ని ఆక్రమించుకొని స్థానికులు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. అయితే ఈ నిర్మాణం ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ రావాడ గణపతి చేస్తుండటంపై శివనగర్ వాసులు అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో గురువారం తహసీల్దార్ టి.సత్యనారాయణ, ఎంపీడీఓ బి.మధుసూదనరావు, ఈఓ ద్రాక్షాయిని, వీఆర్వో అలేఖ్య తదితరులు అక్రమ నిర్మాణాన్ని పరిశీలించారు. సుమారు రూ. కోటి విలువ చేసే ఈ స్థలాన్ని ఆక్రమించి తన సోదరుడితో పాటు తనకూ సరిపోయే విధంగా ఇళ్లు కట్టుకుంటున్నారు. దీన్ని పరిశీలించిన అధికారులు అవాక్కయ్యారు. స్పష్టంగా చెరువు గ ర్భం కనిపిస్తుండడంతో పంచాయతీ నుంచి ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారా అని రావాడ గణపతి అన్నయ్యను ప్రశ్నించారు. 40 ఏళ్ల నుంచి ఈ స్థలం తమ స్వాధీనంలో ఉందని ఆయన వివరించారు. ఆధా రాలు చూపించాలని అధికారులు అడిగితే తెల్లమొఖం వేశారు. ఆధారాలు చూపించేంత వరకు పనులు ఆపాల్సిందేనని తహసీల్దార్, ఎంపీడీఓలు రావాడ గణపతి అన్నయ్యకు చెప్పారు. పనులు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. కాగా ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ ఈ విధంగా అక్రమ నిర్మాణానికి పాల్పడడంపై శివనగర్ వాసు లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువును కాపాడాలని కోరుతున్నారు.