
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి (మీకోసం.ఏపీ.జివోవి.ఇన్) వె బ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల గురించి వాటి స్థితి దానికి సంబంధించి సమాచారం గురించి తెలుసుకోవాలంటే డయల్ 1100కు నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శ్రీకూర్మనాథాలయంలో ‘సదస్యం’
గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథుని కల్యా ణోత్సవాల్లో భాగంగా ఆదివారం సదస్యం జరిగింది. ఆస్థాన మంటపంలో ప్రత్యేక ఆసనంపై ‘చక్ర పెరుమాళ్’ను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు సీహెచ్ సీతా రామనృసింహాచార్యులు, వైదికులు వివిధ పురా ణాలను స్వామికి విన్నవించారు. ఆలయ అర్చకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.నరసింహనాయుడు, శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, దాసుబాబు, మురళీకృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులుపాల్గొన్నారు.
ముమ్మరంగా తనిఖీలు
శ్రీకాకుళం క్రైమ్ : దేశ సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఉత్తర్వులతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్య కూడళ్లలోను, ఆర్టీసీ బస్‌కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, నియంత్రణ, పేలుడు పదార్థాల గుర్తింపు, సంఘ విద్రోహక శక్తుల అడ్డుకట్ట, కొత్త, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులు పూర్తి నిఘా పెట్టారు.

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక