
9.2 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్ట్
ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు 9.2 కిలోల గంజాయి తరలిస్తున్న గమేష్‌నాయిక్ అనే వ్యక్తిని ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్టు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇచ్ఛాపురం పట్టణ పొలీసులు రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు జరుపుతుండగా గమేష్‌నాయిక్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతనిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 9.2 కిలోల గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం గేరేగేడి గ్రామానికి చెందిన ఈయన కుటుంబ పోషణకు డబ్బులు చాలక గంజాయి రవాణాకు దిగాడు. కంధమల్ జిల్లా తిలోరి గ్రామానికి చెందిన అజిత్‌ప్రధాన్, సుభాష్‌ల వద్ద కిలో గంజాయి రూ.రెండు వేలకు కొని మైసూర్‌లో బబ్లూకుమార్‌కు కిలో రూ.పది వేలకు అమ్మడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ తనిఖీలలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు.
గడ్డివాములు దగ్ధం
కాశీబుగ్గ: పలాస మండలం అమలకుడియా పంచాయతీ పూర్ణభద్ర గ్రామ సమీపంలో గడ్డివాములను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం తగలబెట్టారు. గ్రామానికి చెందిన కాయల హరికృష్ణతో పాటు మరో రైతుకు చెందిన ఐదెకరాల గడ్డివాములు ఈ ఘటనలో కాలిబూడిదయ్యాయి. పశువులకు ఏడాదిపాటు సరిపడా గడ్డివాములు దగ్ధం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
సిక్కోలు విద్యార్థులకు
షైనింగ్ స్టార్ అవార్డులు
బూర్జ/మందస/జలుమూరు: జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున షైనింగ్ స్టార్ అవార్డులు అందుకున్నారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన వీరంతా మంగళవారం రాత్రి విజయవాడలో జరిగిన కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. అవార్డులు అందుకున్న వారిలో మందస మండలం హరిపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కంచరాన జ్యోషిత(597), బూర్జ మండలం ఓ.వి.పేట మోడల్ స్కూల్ విద్యార్థి బుడుమూరు ఉదయకిరణ్(593), జలుమూరు మండల కరవంజ మోడల్ స్కూల్ విద్యార్థిని రావాడ హేమశిరీష(592) ఉన్నారు. వీరిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.

9.2 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్ట్

9.2 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్ట్