
ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు తగదు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రజలకు ఐదేళ్లుగా రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న ఎండీయూ ఆపరేటర్లను కూటమి ప్రభుత్వం తొలగించడం తగదని ఎండీయూ ఆపరేటర్ల రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ అన్నారు. ట్రేడ్ యూనియన్ నాయకులతో కలిసి బుధవారం ఎన్‌జీవో హోంలో విలేకరులతో మట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,260 మంది ఎండీయూ ఆపరేటర్లు, 9,200 సహాయకులు పనిచేస్తున్నట్లు చెప్పారు. వీరు విధుల్లో చేరిన సమయంలో 72 నెలలు అగ్రిమెంట్ ఉందన్నారు. ప్రస్తుతం మరో రెండేళ్ల పాటు విధుల్లో కొనసాగే అవకాశం ఉందన్నారు. రాత్రికి రాత్రి ఉన్న ఫలంగా తొలగించడం సబబు కాదన్నారు. ఈ నిర్ణయాల వల్ల 18,500 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ఒక్కో ఆపరేటర్ 1500 నుంచి 2000 ఇళ్లకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టి నిత్యావసర సరుకులు అందించారని గుర్తు చేశారు. బ్యాంకుల ద్వారా వాహనాలకు తీసుకున్న రూ.1,90,000 బకాయిలు ఉందని, వీటిని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తప్పక తొలగించాల్సి వస్తే కార్మిక చట్టం ద్వారా ఆరు నెలలు జీతాలను ముందే చెల్లించాలని, లేనిపక్షంలో ఈ నెల 26న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా ఎండీయూ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు హేమసుందర్, వరహా నర్సింహులు, వెంకట్రావు, అప్పలనాయుడు, రవి, వాసు గోపి, రామారావు పాల్గొన్నారు.