
అవగాహనతోనే నకిలీలకు అడ్డుకట్ట
ఎల్.ఎన్.పేట: ఖరీఫ్ సమీపిస్తుండటంతో రైతులు పొలం పనులకు సమాయత్తమవుతున్నారు. పంట దిగుబడి చేతికి అందివచ్చే వరకు ప్రతి రోజు పొలంలో ఏదో ఒక పనిచేస్తునే ఉంటారు. రానున్న జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ విత్తనాలు చల్లే పనులు ప్రారంభం అవుతాయి. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అంటగట్టి అందినంత దోచుకునేందుకు అదునుగా ఎదురుచూస్తున్నారు. వీరి బారిన పడకుంటా ఉండాలంటే రైతులు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వ్యాపారులు చేస్తున్న అక్రమాలను గుర్తించి ప్రశ్నించగలరని అధికారులు చెబుతున్నారు.
అన్నింటా మోసం..
విత్తనాలు కోనుగోలు చేసి పొలంలో వేసుకున్న తరువాత మొలకలు పూర్తిగా రాకపోవడం, తక్కువ శాతం మొలకలు రావడం జరిగితే నాశిరకం విత్తనాలు ఇచ్చి వ్యాపారి తనను మోసం చేశారని రైతులు అనుకుంటారు. ఒక్క విత్తనాలే అనుకుంటే పొరపాటే. విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులు.. ఇలా ప్రతి వ్యాపారంలోనూ మోసాలు జరుగుతుంటాయి.
పరిశీలన తప్పనిసరి..
ప్రభుత్వ అనుమతి పొంది వ్యాపారం చేస్తున్న డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. రశీదులు (బిల్లులు) ఇవ్వని దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేయకపోవడమే మంచిది. కొనుగోలు చేసిన విత్తనాల సంచుల(బ్యాగ్)కు సీల్ వేసి ఉన్నాయో? లేదో? చూసుకోవాలి. సీల్ వేసి ఉన్న సంచులనే కొనుగోలు చేయాలి. సంచులపై కంపెనీ పేరు, తయారీ, గడువు తేదీలు, నికర బరువు, విత్తన రకం, తేమ శాతం.. తదితర అంశాలను సరిచూసుకోవాలి.
పొలంలో విత్తనాలు వేసుకున్న తరువాత సంచులను, రశీదులను, సంచులపై ఉన్న సమగ్ర వివరాలను తెలియజేసే పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. విత్తనాలు కొనుగోలు సమయంలో మోసం జరిగితే వినియోగదారుల చట్టం ప్రకారం పరిహారం పొందేందుకు ఇవే కీలకమవుతాయి.
విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి
కొనుగోలు చేసేటప్పుడు రశీదు తప్పనిసరి
నకిలీలను గుర్తిస్తే..
పొలంలో వేసిన విత్తనాలకు మొలకలు రాకపోతే నకిలీ విత్తనాలుగా భావిస్తారు. దిగుబడి పూర్తిగా రాకపోయినా నకిలీ విత్తనాలుగానే భావించవచ్చు. వెంటనే వ్యవసాయ శాఖ ఏఓ, ఏడీ, పోలీసులకు అన్ని రకాల రశీదులతో రైతుకు జరిగిన నష్టాన్ని, విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారో తెలియజేస్తూ ఫిర్యాదు చేసి రశీదు ఉంచుకోవాలి. పంటను పరిశీలించి ధృవీకరించేందుకు శాస్త్రవేత్తలను అధికారులు తీసుకొస్తారు. పోలీసుల, వ్యవసాయాధికారులు ఇచ్చిన నివేదికల మేరకు వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది.
– పైడి లతశ్రీ, మండల వ్యవసాయాధికారి, ఎల్.ఎన్.పేట

అవగాహనతోనే నకిలీలకు అడ్డుకట్ట

అవగాహనతోనే నకిలీలకు అడ్డుకట్ట