
రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగింది. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారులపై ప్రమాదాలకు అవకాశాలు ఉన్న చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేయాలన్నారు. డివైడర్లను తొలగిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజినీరింగ్ శాఖలు ఇటీవల జరిగిన ప్రమాదాలను విశ్లేషణ చేసి నివారణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో 108 వాహన సేవలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు.
సమావేశంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్ సుధాకర్, డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ విజయ సారథి, ఎన్‌హెచ్ ప్రాంతీయ ప్రాజెక్టు డైరెక్టర్ తివారి, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్, డీఎస్సీ సీహెచ్ వివేకానంద, డీఎంహెచ్‌వో అనిత తదితరులు పాల్గొన్నారు.