
ఉత్సాహంగా ఉషూ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్థాయి ఉషూ ఎంపిక పోటీలు ఆద్యంతం హోరాహోరీగా సాగాయి. జిల్లా ఉసూ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం జిల్లాస్థాయి సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ ఉషూ ఎంపిక పోటీలు నిర్వహించారు. అంతకుముందు ఉదయం ఈ ఎంపిక పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డాక్టర్ కె.శ్రీధర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతతతో పాటు ఉజ్వల భవిష్యత్ కూడా సొంతమవుతుందన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి మాట్లాడుతూ ఉషూ క్రీడాకారులు దశాబ్దకాలంగా రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం సంతోషకరమన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులను ఈ నెల 12 నుంచి 14 వరకు కర్నూలులో జరగనున్న రాష్ట్రస్థాయి ఉషూ చాంపియన్‌షిప్ పోటీలకు పంపిస్తామని ఉషూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రెడ్డి శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్, ఎస్.జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.